హుజూరాబాద్/ హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 11 : ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం తర్వాత జోరు వాన పడింది. రాత్రి 7గంటల నుంచి అక్కడక్కడ దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీళ్లు వచ్చాయి. హుజూరాబాద్ పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుంచి 11.30 గంటల వరకు ఏకధాటిగా కుండపోత పోసింది. దీంతో పట్టణం అతలాకుతలమైంది. గాంధీనగర్, మామిండ్లవాడ, ప్రతాపవాడ, కాకతీయ కాలనీ, విద్యానగర్ తదితర ప్రాంతాలు జలమయం కాగా, ఇండ్లలోకి వరద చేరింది.
ప్రజలు రాత్రంతా నిద్రలేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. గాంధీనగర్‌లోని ఆరు కుటుంబాలను పునరావాసం కోసం ప్రతాపసాయి గార్డెన్‌కు తరలించినట్టు సీఐ కరుణాకర్ తెలిపారు. ఇటు మూడు రోజుల కిందట ఎల్ఎండీ రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు, తాజాగా పడిన వర్షంతో వరద పెరగడంతో రాత్రి 11గంటల వరకు 10 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు.