వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి మొదలైన వాన ఆదివారం రోజంతా కుండపోత పోసింది. క్షణంపాటు తెరిపిలేకుండా.. కుంభవృష్టిగా కురిసింది. వదలని వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు, కుంటలన్నింటికీ జలకళ వచ్చింది. ఎక్కడికక్కడ పంట పొలాలు నీట మునుగగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. వర్ష బీభత్సానికి పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోయి బాధితులు నిరాశ్రయులు కాగా, కాల్వశ్రీరాంపూర్ మండలం కొత్తపల్లిలో నక్కల ఒర్రెలో ఓ యువకుడు, కూనారం పెద్ద చెరువులో పడి మత్స్యకారుడు గల్లంతుకావడం కలిచివేసింది. భారీగా వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. లోతట్టు, నదీపరివాహక ప్రజలను అప్రమత్తం చేస్తున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి భారీ వరద వచ్చి చేరుతోంది. రేకొండ నుంచి సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ వెళ్లే దారిలోని ఒర్రెలు పొంగుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. హుజూరాబాద్‌లోని చిలుకవాగు, శంకరపట్నంలోని కేశవపట్నం వాగు పొంగుతోంది. చొప్పదండి మండలం పందివాగు పొంగి పొర్లుతుండగా, రాగంపేట, పెద్దకుర్మపల్లి, రేవల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రామడుగు మండలం గుండి చెరువు మత్తడి ఉధృతంగా పడుతుండడంతో లక్ష్మీపూర్, దేశాయిపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఇల్లందకుంట మండలం మల్యాల వాగు పొంగుతుండడంతో పాతర్లపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ మండలం ఇరుకుల్ల వాగు పాత వంతెనను తాకుతూ వరద వెళ్తోంది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి, ఇందిరానగర్ గ్రామాల మధ్య ఉన్న కుంట మత్తడి ఉధృతంగా పడుతుండటంతో రాకపోకలు నిలిచి పోయాయి. ఇలా అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లపై మోకాలు లోతు వరద ప్రవహించింది. కాగా, జిల్లాలో సగటున 110.9 మిల్లీ మీటర్ల (11.0 సెంటీ మీటర్లు) భారీ వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా జమ్మికుంటలో 143.6, అతి తక్కువగా గంగాధరలో 87.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఒర్రె, చెరువులో పడి ఇద్దరు గల్లంతు
కాల్వశ్రీరాంపూర్ మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు గల్లంతయ్యారు. మీర్జంపేట జీపీలో బిల్ కలెక్టర్‌గా పని చేస్తున్న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన చెప్యాల పవన్ ఆదివారం కొత్తపల్లి -మల్యాల గ్రామాల మధ్య నక్కల ఒర్రె దాటుతుండగా బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడిపోయింది. పవన్ ఒడ్డుపైనే ఉండిపోయాడు. అయితే, బైక్ కొత్తది కావడంతో బైక్‌ను బయటికి తీసుకొచ్చేందుకు సాయం కోసం జీపీలో తనతో పనిచేసే సూర్యకు ఫోన్ చేశాడు. అతను రాగానే, ఇద్దరూ కలిసి బైక్‌ను ఒర్రెలో నుంచి తీసే క్రమంలో ఇద్దరూ ఒర్రెలో పడిపోయారు.
సూర్య ఈదుకుంటూ బయటకు రాగా, పవన్ గల్లంతయ్యాడు. బంధువులు, గ్రామస్తులు పవన్ అచూకీ కోసం గాలిస్తున్నారు. మరో ఘటనలో కూనారం పెద్ద చెరువులో పడి కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన మత్స్యకారుడు గొస్కుల కుమార్ (45) గల్లంతయ్యాడు. వరదతో చెరువు నిండగా, చేపలు బయటికి వెళ్లిపోకుండా వల కట్టేందుకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గొస్కుల కుమార్, కలవేన మొగిళి, సాగర్ల తిరుపతి, చేతి నర్సయ్య వెళ్లారు. మత్తడి వద్ద వల కడుతుండగా, గోస్కుల కుమార్ చెరువులో పడి గల్లంతైనట్లు మిగతా ముగ్గురు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రాజెక్టులకు భారీగా వరద
పెద్దపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ తిమ్మాపూర్/ బోయినపల్లి/ గంభీరావుపేట: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. గోదారి ఉధృతి పెరుగడం, ఎగువ నుంచి వరద వస్తుండడంతో పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి బరాజ్‌కు 1,29,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఈ క్రమంలో 20 గేట్లను ఎత్తి 1,44,168 క్యూసెక్కుల నీటిని దిగువన సరస్వతీ బరాజ్‌కు వదులుతున్నారు.
అక్కడ సైతం అన్ని గేట్లు ఎత్తి వచ్చింది వచ్చినట్టే దిగువకు నీటి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 31 అడుగులకు గాను ఆదివారం రాత్రి వరకు పూర్తి స్థాయిలో నిండింది. కామారెడ్డి జిల్లా పాల్వంచ, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల ద్వారా మానేరుకు 32 వేల క్యూసెక్కులకు పైగా భారీగా వరద వస్తోంది. ఇక బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయానికి సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల నుంచి 33,805 క్యూసెక్కులు, గాయత్రీ పంప్‌హౌస్ నుంచి 6300 క్యూసెక్కుల వరద వస్తున్నది.
27.5టీఎంసీల సామర్థ్యం ఉన్న మధ్యమానేరులో ప్రస్థుతం 15.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ రిజర్వాయర్ నిండుతున్నది. ఉప్పొంగుతున్న మోయతుమ్మెద వాగు ద్వారా 40 వేల క్యూసెక్కులు, శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి 3వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 24 టీఎంసీల సామర్థ్యం ఎల్ఎండీలో ప్రస్తుతం 14.058 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నేడో, రేపో ఎల్ఎండీ నిండే అవకాశం ఉంది.