రాజన్న సిరిసిల్ల, జూన్ 11(నమస్తే తెలంగాణ): కాసుల కక్కుర్తితో అనవసరపు సిజేరియన్లు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ దవాఖానలపై నజర్ పెట్టారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు మంగళవారం రంగంలోకి దిగారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రజిత ఆధ్వర్యంలో వైద్యాధికారులు సిరిసిల్ల, వేములవాడలోని పలు దవాఖానల్లో తనిఖీలు చేశారు. అల్ట్రాసౌండ్, స్కాన్ సెంటర్లను పరిశీలించారు.
పీసీపీఎన్డీటీ యాక్ట్ అనుసరించి స్కానింగ్ సెంటర్లలో ఫారం- ఎఫ్‌లో గర్భిణుల వివరాలు, స్కానింగ్ చేసేందుకు కారణాలను పొందుపరచాలని యజమాన్యానికి సూచించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించిన వైద్యులకు మూడేండ్ల జైలు, 10వేల జరిమానా, ప్రోత్సహించిన వారికి 50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలే చేయాలని, అత్యవసరమైతేనే శస్త్ర చేయాలని సూచించారు. తనిఖీల్లో హెచ్ఈ బాలయ్య, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.