HUZURABAD CPM | హుజురాబాద్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హెచ్సీయూ సంఘటనలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ సీపీఎం, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను, అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం సరైనది కాదని మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడంపై రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో నిర్బంధ పాలన సాగుతుందన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరి పాలన సాగడం లేదని, ప్రభుత్వ అధికార యంత్రాంగం పోలీసులను ఉసిగొల్పుతూ నాయకుల ఇళ్ళలోకి వెళ్లి అరెస్ట్ చేయడం, పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రాత్రికి రాత్రే అడవులను తగలబెట్టడం మూలంగా వన్యప్రాణులు, జీవచరాలు మరణించాయని, యూనివర్సిటీ కి చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పరేట్ శక్తులకు అమ్ముకుంటుందని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, యూనివర్సిటీ భూములను పరిరక్షించేంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి అనేక విధాలుగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన భూములను ఏ విధంగా లాక్కుంటారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కోంకట చంద్రయ్య మైస చేరాలు, అన్న ప్రశాంత్, ఏ రమేష్ అందేష్ రవి, ఏం రవి పొడిసెట్టి ప్రభుశంకర్ తదితరులు పాల్గొన్నారు.