Gambhiraopet | గంభీరావుపేట, మే 4 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రోడ్డుపై నాగంపేట, దమ్మన్న పేట, మల్లు పల్లి గ్రామాల రైతులు సోమవారం ధర్నా చేశారు. భూమి, ప్రకృతి ని నమ్ముకుని ఆరుగాలం కష్ట పడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి సైతం రోడెక్కే పరిస్థితులను ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నదాతలు రోడ్డు పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తరుగు పేరిట 42 కిలోల 600 గ్రాముల తూకం వేస్తేనే తీసుకుంటామని రైస్ మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ కు సరైన సమయానికి లారీలు రాకపోవడం తో సుమారు 25 రోజుల నుండి వడ్ల కుప్పల వద్ద ఉంటూ రాత్రి పగలు అనకుండా పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మద్దుల రాజిరెడ్డి, సత్యం, రైతులు హన్మంతరెడ్డి, బాపురెడ్డి, రాములు, మామిండ్ల రాజం, లింగం, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.