తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా మండలాల నుంచి నియోజకవర్గాలకు తరలివచ్చిన మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. వంటకాలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించి ఘనంగా సన్మానించారు. స్వశక్తి సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. కాగా, హుజూరాబాద్, మానకొండూర్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం మధురానగర్‌లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
హుజూరాబాద్/ మానకొండూర్/ కలెక్టరేట్/ గంగాధర, జూన్ 13 : మహిళా సంక్షేమ దినోత్సవం అంబరాన్నంటింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకలుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో విజయవంతమైంది. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. మిల్లెట్స్‌తో చేసి న, ఇతర వంటకాలను ప్రదర్శించారు. కాగా, మానకొండూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ య, సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వి విధ శాఖల మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. స్వశక్తి సంఘాలకు గత ఆర్థిక సంవత్సరం మంజూరు చేసిన రూ.284 కోట్ల 46 లక్షల 98 వేల జంబో చెక్కును అందజేశారు. హుజూరాబాద్‌లోని సాయిరూప కల్యాణ మండపంలో జరిగిన వేడుకలకు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ విజయ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. ముందుగా పలువురు గర్భిణులకు పూలు, పండ్లు, బట్టలు అందజేసి సీమంతం నిర్వహించారు.
అనంతరం 19 మహిళా సంఘాలకు రుణ చెక్కులను పంపిణీ చేశారు. 10 మంది బధిరులకు హియరింగ్ పరికరాలు అందజేశారు. గంగాధర మండలం మధురానగర్‌లోని వీఏఎస్ గార్డెన్లో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. సామూహిక సీమంతాలు ని ర్వహించగా, ఎమ్మెల్యే మహిళలకు పసుపు, కుంకు మ, చీర, పౌష్టికాహారం అందజేశారు. నియోజకవర్గంలోని 3459 మహిళా సంఘాలకు రూ.286 కోట్ల 22 లక్షలా 11 వేల బ్యాంకు రుణాలను అందజేశారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులను సన్మానించి మెమొంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
కరీంనగర్‌లోని గోపికృష్ణ ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. పలు రంగాల్లో ప్రతిభచూపిన మహిళలకు జ్ఞాపికలు అందించి సన్మానించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించగా, వారికి న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. పలు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.66 కోట్ల పైచిలుకు రుణాలు పంపిణీ చేశారు. ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి పాల్గొన్నారు.