Kondagattu | 14న హనుమాన్ పెద్దజయంతి.. నేటి నుంచి కొండగట్టులో వేడుకలు
కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమాన్ పెద్ద జయంతి కాగా, లక్షలాది మంది అంజన్న దీక్షాపరులు తరలిరానున్నారు.
- ఉత్సవాలకు అంకురార్పణ
- తరలిరానున్న లక్షలాది మంది అంజన్న దీక్షాపరులు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- భద్రాద్రి నుంచి వచ్చిన పట్టువస్ర్తాలు
Kondagattu | కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమాన్ పెద్ద జయంతి కాగా, లక్షలాది మంది అంజన్న దీక్షాపరులు తరలిరానున్నారు. కాగా, గురువారం యాగశాలను శుద్ధి చేసి అఖండ దీపాన్ని స్థాపించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.
-మల్యాల, మే 11
అంజన్నకు రాములోరి పట్టువస్ర్తాలు
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా స్వామివారికి భద్రాచలం సీతారచంద్రస్వామి ఆలయం నుంచి పట్టు వస్ర్తాలు పంపించారు. వాటిని శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వామివారికి సమర్పించనున్నారు.
3.60 లక్షల లడ్డూ ప్రసాదం
ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను తయారు చేసి పెట్టారు. ఇవి సరిపోని పక్షంలో వెంటనే తయారుచేసేందుకు అదనపు సిబ్బందిని సైతం కేటాయించినట్లు ప్రసాద తయారీ ఇన్చార్జి ధర్మేందర్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడే పులిహోర తయారుచేస్తామని చెప్పారు. 14 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కొండగట్టులోనే రెండు జయంతులు
ఆంజనేయ స్వామికి ఒక కొండగట్టులో మాత్రమే రెండు జయంతులు నిర్వహిస్తున్నారు. చైత్ర పౌర్ణమి రోజు ఉత్తర భారత దేశంతోపాటు దక్షిణ భారత దేశంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకం, పూజాది కార్యక్రమాలతోపాటు యజ్ఞాలు నిర్వహించడం ఆచారంగా వస్తున్నది. కానీ, ఆరోజు కొండగట్టులో మాత్రం హనుమాన్ చిన్న జయంతిని ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞయాగాదులు నిర్వహించకుండా కేవలం అభిషేకం, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి దీక్షాపరులు కొండగట్టుకు చేరుకొని తాము స్వీకరించిన దీక్షలను స్వామి సన్నిధిలో విరమిస్తారు.
వైశాఖ బహుళ దశమి రోజు పెద్ద జయంతి
ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజు ఆలయంలో అనాదిగా హనుమాన్ పెద్ద జయంతి, ఆలయ ఆచార సాంప్రదాయానుసారంగా స్వామి వారి తిరునక్షత్ర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం చేసి, జయంతి రోజు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.
ఉత్సవాలకు అంకురార్పణ
పెద్ద జయంతి సందర్భంగా అంజన్న ఆలయంలో సోమవారం సాయంత్రం యాగశాల శుద్ధి చేసి, పుణ్యాహవచనం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం అఖండ దీప స్థాపన చేశారు.
తొలి రోజు
ఉదయం స్వస్తిక్వచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, అరుణి మథనం, దేవతాహ్వానం, ఉత్సవ మూర్తుల యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతారాధన, అగ్నిప్రతిష్ట, హవనం, స్వామివారికి అభిషేకాలు, సహస్ర నామార్చన. సాయంత్రం విష్ణసహస్రనామ పారాయణం, స్థాపితదేవతారాధన, బలిహరణం, సుందరాకండ పారాయణం, అమ్మవారి సహస్రమామకుంకుమార్చన, బలిహరణం, మంత్రపుష్ప నిదేదన.
తరలిరానున్న దీక్షాపరులు
జయంతి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షలాది మంది స్వామి దీక్షాపరులు కాలినడక, ఇతర మార్గాల్లో కొండగట్టుకు తరలి రానున్నారు. స్వామి సన్నిధిలో దీక్ష విరమించి, మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్తారు.
నేటి నుంచి ఆర్జిత సేవలు బంద్
శుక్రవారం నుంచి జయంతి ఉత్సవాలు ముగిసే వరకు ఆలయంలో అభిషేకాలు, వాహనపూజలు, సత్యనారాయణవ్రతాల వంటి ఆర్జిత సేవలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో అమరేందర్ తెలిపారు. జయంతి ముగిసిన తర్వాత యధావిధిగా కొనసాగిస్తామన్నారు.
అంజన్న ఆలయంలో సెల్‌ఫోన్ సేవలు
ఏటా ఉత్సవాల సందర్భంగా సమన్వయం చేసేందుకు అధికారులు ఇప్పటి వరకు వైర్లెస్ సేవలను ఆలయ పరిధిలో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. కాగా, చిన్న జయంతి సమయంలో పెద్ద జయంతి ఉత్సవాల నాటికి కొండపైన భక్తులకు సెల్‌ఫోన్ సేవలను వినియోగంలోకి తెస్తామని జగిత్యాల కలెక్టర్ యాస్మిన్‌బాషా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుట్టపైన శాశ్వత ప్రాతిపాదికన జియో టవర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఎయిర్టెల్ టెంపరరీ టవర్ కంటెయినర్‌ను ఏర్పాటు చేసి సెల్‌ఫోన్ సిగ్నల్ సేవలను గురువారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు.
నిఘా నీడన ఉత్సవాలు
ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. దేవాలయం తరఫున ఆలయంలోపల, వెలుపల అమర్చిన 64కు అదనంగా 40 సీసీ కెమెరాలను అమర్చారు. కొత్త పుష్కరిణి, దీక్ష విరమణ మండపం, పాత అన్నదాన సత్రం, పోలీస్ ఔట్ పోస్టు, మెట్లదారి లడ్డూ పులిహోర ప్రసాద తయారీ కేంద్రం, నాలుగు దిక్కులు కవరయ్యేలా రామాలయం వద్ద హైమాస్ లైట్లకు, బస్టాండ్ వద్ద టికెట్ బుకింగ్, వై జంక్షన్ కమాన్‌కు సీసీ కెమెరాలను బిగించారు. సీసీ కెమెరాల ద్వారా ఉత్సవాలను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఇబ్బంది తలెత్తినా క్షణాల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పూర్తి
- పెద్ద జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం వివరించారు.
- వాహన పూజా స్థలంలో 21 బృందాలు, 800 కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు.
- కోలాటాలు, భజనలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు చప్పుళ్ల మధ్య 16 కళాబృందాలతో శోభాయాత్రకు సర్వం సిద్ధం చేశారు.
- చిన్న జయంతికి చేసిన ఏర్పాట్లకు తోడు అదనంగా క్యూలైన్లు, మాల విరమణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
- సీసీ కెమెరాల రికార్డులను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రసారం చేయనున్నారు.
- చిన్న జయంతికి ఏర్పాటు చేసిన బారికేడ్లు, క్యూ లైన్ల నిర్మాణం, చలువ పందిల్లు, చలివేంద్రాలు వంటి వాటికి చిన్న చిన్న మార్పులు, మరమ్మతులు చేపట్టారు.
- గుట్ట మీదికి వచ్చే భక్తుల కోసం టికెట్ విక్రయ కేంద్రాలు, కేశఖండనం, మాల విరమణ, లడ్డూ పులిహోర విక్రయ కేంద్రాల వద్ద క్యూ లైన్లు, బారికేడ్లను నిర్మించారు.
- స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు నిర్మించారు.
- ఘాట్ రోడ్డుపై 7, నాచుపెల్లి జేఎన్టీయూ మార్గంలో 4, వై జంక్షన్ నుంచి ప్రధానాలయం వరకు 8 చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్ రోడ్డు పై 3, జేఎన్టీయూ మార్గంలో 3 చోట్ల కుండల్లో నిరంతరం నీటిని నింపనున్నారు.
- గుట్ట మీద ఉన్న ఐదు సులభ్ కాంప్లెక్స్‌లతో పాటు దీక్షా విరమణ మండపం వెనుక, గుట్ట మీద మెట్ల దారికి సమీపం, ఘాట్ రోడ్డుకు ఇరువైపులా, నాచుపెల్లి మార్గంలో 75 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు.
- పారిశుధ్య నిర్వహణకు జగిత్యాల డీపీవో అదనపు సిబ్బందిని సమకూర్చారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ, జగిత్యాల మున్సిపల్ సానిటేషన్ సిబ్బంది ఇందులో పాలు పంచుకోనున్నారు.
- గుట్ట మీద వాహన పూజల షెడ్డు, వై జంక్షన్ వద్ద, గుట్ట కింద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
- భక్తులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

