కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 1 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు కేవలం కేసీఆర్‌ను విమర్శించడం తప్ప మరొకటి తెల్వదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అనవసర విమర్శలు మానుకోవాలని, చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంజయ్ ఎంతసేపు బీఆర్ఎస్ను కుటుంబ పార్టీ అని మాట్లాడుతున్నాడని, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ఎన్డీఏలో 23 పార్టీలు ఉన్నాయని, అందులో కుటుంబ పార్టీలు లేవా..? అని ప్రశ్నించారు. పక్కనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ కుటుంబ పార్టీ కాదా..? అని, అది ఆయనకు కనిపించడం లేదా ఆగ్రహించారు. ఇంకా జనసేన, ఎల్జీపీ, జేడీఎస్ ఇలా అన్ని పార్టీలు కూడా కుటుంబ పార్టీలేనని గుర్తు చేశారు. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న సంజయ్ సోది మాటలు బంద్ చేయాలని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఇన్ని కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్పై విమర్శలు చేసే అర్హతే లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
మిగిలిన కుటుంబ పార్టీల్లో ఉన్నట్టుగా కేటీఆర్, కవిత, హరీశ్‌రావు రాజకీయాల్లోకి రాలేదని, పార్టీ పెట్టినప్పుడు పునాదుల్లా పని చేశారని, నిత్యం పార్టీలో.. ప్రజలతో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేశారు. కేసీఆర్, కవితపై పెట్టిన కేసులు కక్షసాధింపు కేసులేనని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు ఏ కేసులోనైనా కేసీఆర్‌పై ఎఫ్ఐఆర్ బుక్ అయిందా..? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా.. మరి ఎందుకు కేసులు పెట్టి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కవితపై పెట్టిన కేసు బ్లాక్మెయిల్ కేసు మాత్రమేనని చెప్పారు. అసలైన క్రిమినల్ సంజయ్ అని విమర్శించారు. కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకుపోతుంటే ఆయన మాత్రం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కొట్లాడుతున్నాడని విమర్శించారు.
అక్రమ దందాలు, అవినీతి ఆరోపణలు ఉన్న 23 మంది నాయకులను బీజేపీలోకి తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీని తిడుతుంటే వారం రోజులుగా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సంజయ్ మనసులో మోడీ దెయ్యమని అనుకుంటున్నాడని, అందుకే స్పందించడం లేదేమోనని తాము భావిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదాయం లేదని చెప్పుతున్నారని, కేంద్ర మంత్రిగా బండి కూడా అదే అంటున్నారని, మరి ఎందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ ఛైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్రావు, శ్రీనివాస్‌గౌడ్, దూలం సంపత్, ఆరె రవి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.