తిమ్మాపూర్, మే 24 : ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ ఇష్యూ చిన్న అంశమని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అంతర్గత అంశాన్ని ఇతర పార్టీలు అద్దంలో పెట్టి చూస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఇష్యూ ఉంటే చాలు మైకులందుకుంటారని, కేసీఆర్ గురించి మాట్లాడితే తాము ఫ్రంట్ పేజీల్లో కనిపిస్తామన్న ఆలోచనతో అలా చేస్తారని ఎద్దేవా చేశారు.
లేఖ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలని హితవుపలికారు. ఎమ్మెల్సీ కవిత గతంలో సైతం ఎన్నోసార్లు అధినేత కేసీఆర్‌కు సూచనలు చేశారని, బీఆర్ఎస్లో ఆ స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. గతంలో ఆమె చేసిన సూచనలను పాటించి సక్సెస్ అయ్యామన్నారు. ఈ విషయంపై మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్‌లో మహిళలకు పదవులు ఇవ్వడం లేదని సాక్షాత్తూ మహిళా అధ్యక్షురాలు పీసీసీ అధ్యక్షుడి చాంబర్ ఎదుట ధర్నా చేశారని, అప్పుడెందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి మొండి చేయి చూపించినా బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. చిన్న చిన్న అంశాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాలని హితువు పలికారు. సమావేశంలో నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, రావుల రమేశ్, ఉల్లెంగుల ఏకానందం, పాశం అశోక్‌రెడ్డి, తిరుపతి, సుదగోని సదయ్య పాల్గొన్నారు.