తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారింది. అప్పు కోసం తిరుగకుండా రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందుతున్నది. 24గంటల ఉచిత కరెంట్ ఉంటున్నది. కాళేశ్వరంతో గోదారి జలాలు పరుగులు తీశాయి. చెరువులు, కుంటలు మండుటెండల్లోనూ కళకళలాడుతున్నాయి. బీడు భూముల్లోనూ బంగారు పంటలు పండుతున్నాయి. మొత్తంగా పల్లెలు ఉపాధి కేంద్రాలుగా మారాయి. ఇవన్నీ చూసిన వలస జీవుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నాలుగేండ్ల నుంచి ఎడారి దేశాలను వదిలి ఎంతో మంది సొంతూళ్ల బాట పట్టారు. ఉన్న ఊరిలో ఎవుసం చేసుకుంటూ.. కండ్ల ముందు కుటుంబాలను చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నా సాగు నీరు లేక కేవలం వర్షా కాలంలోనే పంటలు సాగు చేసేవారు. వర్షాలు అనుకూలిస్తే గానీ, పంటలు చేతికి వచ్చేది కాదు. గన్నేరువరం, గంగాధర, చిగురుమామిడి వంటి పూర్తి మెట్ట ప్రాంతాల్లో అయితే వర్షా కాలమే పంటలు ఎండి పోయే పరిస్థితి ఉండేది. వర్షాలు అనుకూలించి బావులు, బోర్లలో నీళ్లున్నా కరెంటు కోతలు రైతుకు గుండె కోతలు మిగిల్చేవి.
నాకు దమ్మన్నపేట శివారుల మూడెకరాలకు పైగా భూమి ఉంది. రాష్ట్రం రాకముందు కరువు వెంటాడడంతో పదకొండేళ్ల క్రితం బతుకు దెరువు కోసం మస్కట్‌కు వెళ్లిన. అక్కడ లేబర్ పని చేసుకుంట బతికిన. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ నీళ్లు తెస్తున్నడని వార్తలల్ల చూసిన. నాయిన నీళ్లు వస్తున్నయని నా పిల్లలు కూడా చెప్పిండ్రు. ఇంక ఎడారి దేశంల ఉండుడెందుకని రెండేండ్ల కింద గంభీరావుపేటకు వచ్చిన. అడవి లెక్క మారిన నా భూమిని చదును చేసి, బావి తవ్వించిన. 12 గజాలల్లనే మస్తు నీళ్లచ్చినయ్.. శానా మంచిగనిపించింది. భూమిల ఇన్ని నీళ్లున్నయంటే నమ్మలేదు. కేసీఆర్ పుణ్యాన నీళ్లచ్చినయని అర్థమైంది. రెండు కాలాలల్ల పంటలు పండించిన.. సర్కారు ఇచ్చిన రూ.15 వేల పెట్టుబడితో వరి సాగు చేసిన. అన్ని ఖర్చులు పోను రూ.లక్ష లాభం వచ్చింది. మస్కట్ల అరకొర జీతంతో బతికిన నన్ను కేసీఆర్ సారు లక్షాధికారిని చేసిండు. పనికి రాని భూమిని పంటలు పండించేలా చేసిండు.. కష్టం మాదైనా నీళ్లు లేంది ఏంజేస్తం. అక్కడ కపిల్(మస్కట్‌లో యజమాని) ముంగట బిక్కు బిక్కు మంటూ పనిజేసిన.. ఇక్కడ రాజు లెక్క బతుకుతున్న. వలస కూలీని రాజుగ మార్చిన కేసీఆర్ సారుకు మా ఇంట్లోళ్లమంతా రుణపడి ఉంటం.
– గంగిశెట్టి కృష్ణ, గంభీరావుపేట
కాళేశ్వరం ప్రాజెక్టు రావడంతో మెట్ట ప్రాంతాలన్నీ నీళ్లతో నిండిపోయాయి. సజీవ నదిగా మారిన వరద కాలువనే కాకుండా ఊరూరికి లింక్ కాలువలు తవ్వి ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపుతున్నారు. దీంతో ఒకప్పటి మెట్ట ప్రాంతాల్లో ఇపుడు భూగర్భ జలాలు పెరిగాయి. బావులు, బోర్లలో నీటి మట్టం పెరిగింది. దీంతో వ్యవసాయ క్షేత్రాలన్నీ సస్యశ్యామలంగా మారిపోయాయి. రైతులుగా ఉండి గల్ఫ్ దేశాలకు వెళ్లి కూలీలుగా మారిన రైతులు మూడేళ్ల నుంచే ఇంటి దారి పట్టారు. ఇక్కడే కావల్సినంత బతుకుదెరువు కనిపిస్తుండడంతో గల్ఫ్‌కు వెళ్లాలనే ఆలోచన చేసేవారే కరువై పోయారు. ఉన్న భూమిలో బంగారంలాంటి పంటలు పండించుకుంటున్నారు. ఒక్క సారిగా వీళ్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయానికితోడుగా ఇతర వ్యాపకాలు, వ్యాపారాలు కూడా చేస్తున్నారు. పలు గ్రామాల రైతులు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీలు కొంటున్నారు. ఆటోలు కొని కొడుకులకు ఇస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కుటుంబంలో పని లేకుండా ఉండే వారే కనిపించడం లేదు. ప్రతి ఒక్కరికీ ఇదే ప్రాంతంలో పనులు దొరుకుతుండడంతో గల్ఫ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తమకేమిటని అంటున్నారు..
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సామ నాగేశ్‌కు నాలుగెకరాల భూమి ఉంది. నీటి వసతి లేక బీడుగా మారింది. సాగు చేద్దామని ప్రయత్నిస్తే విత్తనాలు, కూలీలకు పెట్టిన ఖర్చు కూడా తిరిగి వచ్చేది కాదు. దీంతో బతుకు దెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ నెలంతా పని చేసినా రూ.10 వేలు వచ్చేవి కావు. ప్రత్యేక రాష్ట్రం రావడం.. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో నాగేశ్ మనసులో స్వదేశానికి రావాలన్న ఆశ చిగురించింది. అనుకున్నట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపడంతో రుద్రంగి మండలంలోనూ భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో నీటిమట్టం పెరిగింది. పంటలు బాగా పండుతున్నాయని తెలుసుకొని నాగేశ్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. బీడు భూమిని సాగులోకి తెచ్చాడు. వరితో పాటు పసుపు, మక్కజొన్న, మిర్చి, టమాట, ఎల్లి, ఉల్లి, చిక్కుడు, క్యారెట్, బీట్రూట్ వంటి తీరొక్క పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నానని నాగేశ్ సంతోషంగా చెబుతున్నాడు.
నాకు ఊళ్లె నాలుగెకరాల పంట భూమి ఉంది. నీళ్లు లేక, ఆర్థిక పరిస్థితి సరిగా ఉండక బతుకుదెరువు కోసం ఇబ్బంది పడ్డా. మా ఊరోళ్లు కొందరు పని కోసం దుబాయ్ వెళ్లడంతో నేను కూడా విధి లేని పరిస్థితుల్లో వెళ్లిన మూడేండ్లు కూలీగా బతుకీడ్చిన. అదే సమయంలో తెలంగాణ రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో వ్యవసాయం పండుగలా మారిందని తెలుసుకున్న. దేశం కాని దేశంల పడరానికి పాట్లు పడుతూ బతికే కంటే.. సొంతూళ్లె ఎవుసం చేసుకుంట అయినవాళ్లతో దర్జాగా బతుకచ్చు అనిపించింది. వెంటనే దుబాయ్ వదిలి, నాలుగేండ్ల క్రితం వచ్చిన. నిజంగనే ఇక్కడ పరిస్థితి మారినట్లు కనిపించింది. ఒక్క మా ఊరే కాదు.. కథలాపూర్, మేడిపల్లి, వేములవాడ, కొడిమ్యాల అన్ని మండలాల్లో నీళ్లు కనిపించినయ్. రైతుబంధు వచ్చింది. ఎడారిగా మారిన భూములు పచ్చగ మారినయ్.. తుమ్మలు మొలిసిన చెరువులు మిషన్ కాకతీయతో మంచిగైనయ్. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్‌తో చెరువులు నిండినయి.. కరెంట్ ఒక్క నిమిషం కూడా పోతలేదు. బోర్ల కింద, పంపుల కింద మంచి పంటలు పండుతున్నయ్. ఉన్న నాలుగెకరాలు పొతంజేసిన. ఎవుసం చేసుకుంటున్న.. దుబాయ్ కంపెనీవోళ్లు మళ్లీ రమ్మన్నరు.. నేను ఇగ రాను అని జెప్పిన.. పెండ్లి చేసుకొన్న.. ఇల్లు చూసుకుంటున్న.. ఎవుసం చేసుకుంట బతుకుతున్న.. నిజంగా సీఎం కేసీఆర్ సార్ చేసిన కృషి వల్లనే నేను దుబాయ్ పోకుండ ఇక్కడనే బతుకుతున్న..
– చెదల రాజు, చింతకుంట, కథలాపూర్ మండలం
మా ఊళ్లె శానా మంది ఎవుసం మీదనే బతికేటోళ్లం. ఆ కాలంల బోర్లళ్ల చుక్క నీరు లేక అప్పో సొప్పో జేసి, గల్ఫ్ దేశాలకు పోయినం. శానా ఏండ్లు అక్కడే ఉండి ఇక్కడ ఇంట్లోళ్లను సాదుకున్నం. నేను మస్కట్ పోయి బిల్డింగులు కట్టే పనిల జేరిన. పానాలు అరచేతిల పెట్టుకొని బతుకు ఎల్లదీసినం. అక్కడి మాట రాదాయె.. వాళ్లు జెప్పిన పని జేసెటోళ్లం. పని ఎక్కువ చెప్పించుకునేటోళ్లు. పైసలేమో తక్కువ ఇచ్చేటోళ్లు. నాలుగు గంటలు కూడా నిద్రపోకపోయేది. కొద్దిగ లేటైతే డ్యూటీ బస్సు పోయేది. ఆ రోజు కాడ(ఆప్సెంట్) పడేది. జీతం కట్ అయ్యేది. ఆ దుఃఖం యాదికత్తె అన్నం కూడ తినబుద్ది కాదు. మా బతుకంతా బహర్ దేశంలనే అనికొని బాధపడేటోళ్లం. కేసీఆర్ సారు కట్టిన మిడ్‌మానేరు(శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్)తో మా ఊళ్లె పాడుబడ్డ బావులల్ల కూడా నీళ్లచ్చినయ్. ఇది తెలిసినంక ఏడాదినర్ధం కిందనే మస్కట్ నుంచి సుట్టి(సెలవు) మీద వచ్చిన. ఇగ ఈ నీళ్లను జూసి పోబుద్దికాలే. నాది మా తమ్ముంది కలిసి మూడెకరాలంత వరేసిన. కేసీఆర్ సారు గిన్నిగనం నీళ్లు తెచ్చి రైతుల్ని రాజులను జేసిండు. ఒకప్పుడు ఎంత పొలం ఉన్న ఆంధ్రోళ్లు ఏం లాభం లేకుంట జేసిన్రు.. బహర్ దేశం పోతే ఒకల కింద పని చేసి ఇచ్చినకాడికి తీసుకునేది. కానీ, కేసీఆర్ సారు ఎక్కడా ఇయ్యని విధంగ పెట్టువడికి సాయం చేస్తండు. పండిన పంటకు మంచి ధర వచ్చెటట్టుజేస్తండు. అందుకే దేశాలు వట్టుకొని తిరుగుడు మానేసిన. రైతులకు ఇంత మంచిజేస్తున్న కేసీఆర్ సారు నా మనసుల ఎప్పటికీ దేవుడే..
– మారఠి భుమయ్య, వ్యవసాయ రైతు, హరిదాస్‌నగర్
“నాటి కట్టం పగోనికి గూడ రావద్దు.. అయ్యవ్వను, పెండ్లాం పిల్లలను, ఐనోళ్లను వదిలిపెట్టి దేశంగాని దేశం పోయి అరిగోసపడేది.. ఎర్రని ఎండకు, ఉసికెల ఉప్పరి పనిజేత్తుంటే పెద్దలు కనిపించెటోళ్లు.. ఉన్న ఐదారెకరాల భూమిల చేసుకొని బతుకక ఎందుకచ్చిన గోసరా ఇది అని అనిపించేది.. అనుకున్న కొద్దిసేపటికే ఊళ్లె పొలమైతే ఉంది గానీ, పారిచ్చెటందుకు నీళ్లు లేకపాయే.. కరెంట్ ఎప్పుడత్తదో తెల్వకపాయె.. ఊళ్లె ఎవుసం నమ్ముకుంటే బతుకుదుమా.. దుబాయ్కచ్చిందే నయమైంది.. ఓ నాలుగేండ్లు కట్టపడితే పైసలు పొల్ల లగ్గానికి, పోరని సదువుకు అక్కరకత్తయి అని మనసు తుర్తి చేసుకునేది.. ఎప్పటికైనా.. పుట్టిన ఊళ్లె తాతల నుండి అచ్చిన భూమిల ఎవుసం చేయాలని ఆశపడేది.. ఆశ తీరుద్దా? అనుకొని బాధపడేది.. ఆశ తీరాలని దేవున్ని మొక్కుకునేది.. మా మొక్కులు చెవులవడ్డయి కావచ్చు.. తెలంగాణ అచ్చింది.. కేసీఆర్ సార్ సీఎం అయ్యిండు.. అప్పుడే నాకు ఊరికి రావచ్చన్న ఆశ పుట్టింది. అనుకున్నట్టే ఇక్కడ రోజంతా కరెంట్ ఇచ్చిన్రు.. రైతుబంధు, రైతు బీమా వచ్చినయ్.. మా వరద కాలువకు తూములు వెట్టిన్రు.. చెర్లను నింపెటందుకు రివర్స్ పంపింగ్ మోటర్లు పెట్టిన్రు.. ఇరవై ఏండ్లసంది పోయిన దుబాయ్‌ని వదిలిపెట్టి.. నా భూమిల నేనే ఎవుసం చేసుకుంటున్న.. నాలుగు రూపాయిలు కండ్లజూత్తున్న.. పెండ్లాం పిల్లలతోటి, సోపతోళ్లతోటి ఉంటే మనసు నిమ్మలమైతంది.. సీఎం కేసీఆర్ పుణ్యంతోటే దుబాయ్ ఇడిసి పెట్టిన..” అంటూ తాను ఒకప్పుడు దుబాయ్‌ల పడ్డ కష్టాలను.. ఇక్కడికి వచ్చినంక ఎంత ఆనందంగా జీవిస్తున్నాడో చెబుతున్నాడు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన పోకతోటి భూమయ్య. ఇతనికి ఊళ్లె పదెకరాల దాకా వ్యవసాయ భూమి ఉంది. నీటి వసతి లేక బతుకుదెరువు కోసం 25 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు.. రెండేండ్లకొకసారి స్వదేశానికి రావడం, నెల, రెండు నెలలు ఉండడం, మళ్లీ ఎడారి బాట పట్టడం సర్వసాధారణంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రైతుబంధు పథకంతో పెట్టుబడి, పారే అన్ని నీళ్లు, 24 గంటల కరెంటుతో తనకున్న పదెకరాలు ఎలాంటి భయం లేకుండా సాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీంతో భూమయ్య మూడేండ్లుగా బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లడం మానుకొన్నాడు. ఇక్కడే తనకున్న భూమిలో వరి, మక్క, పసుపు, మిర్చిని సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.