పెద్దపల్లి, మార్చి 14(నమస్తే తెలంగాణ)/ వీణవంక : నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువకులు గ్రూప్స్‌లో మెరుగైన ర్యాంకులతో మూడేసి కొలువులు సాధించారు. గతంలోనే గ్రూప్-4లో ఎంపికై ఉద్యోగాలు చేస్తుండగా, ఇటీవల విడుదలైన గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లోనూ ఉత్తమ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలిచారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కొక్కుల అర్చన-సమ్మయ్య (ఆర్ఎంపీ డాక్టర్) దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా, విశ్వసారథి చిన్న కొడుకు. వీణవంక శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో ప్రాథమిక విద్య, జమ్మికుంట కాకతీయ పాఠశాలలో ఉన్నత విద్య, హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. గ్రూప్-4 కు ఎంపికై చౌటుప్పల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నత ఉద్యోగాల కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ఉద్యోగం చేస్తూనే చదువుపై దృష్టిసారించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-2లో 566 ర్యాంక్ సాధించగా, తాజాగా శుక్రవారం ప్రకటించిన గ్రూప్-3 ఫలితాలలో 205 ర్యాంక్ సాధించాడు. విశ్వసారథి గ్రూప్స్ పరీక్షల్లో సత్తాచాటడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గౌడ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రాజాగౌడ్ గీతకార్మికుడు కాగా, 2022లోనే గుండెజబ్బుతో మరణించాడు. తల్లి శకుంతల వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నది. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. ఎంఫార్మసీ చదివిన పెద్ద చెల్లెకు వివాహం కాగా, మరో చెల్లెలు మానస హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. పదో తరగతి వరకు మంథనిలోనే చదివిన మహేశ్ ఇంటర్లో మంథని డివిజన్ టాపర్‌గా నిలిచాడు. మంథని జేఎన్టీయూహెచ్లో బీటెక్‌లో మైనింగ్ కోర్సులో చేరాడు. అయితే, ఇంటర్ సమయంలోనే పబ్లిక్ సర్వీస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌పై ఇష్టంతో మంథనికి చెందిన సామాజిక కార్యకర్త మహావాది సతీశ్ ఆర్థిక సహకారంతో యూపీఎస్సీ సివిల్స్ వైపు దృష్టిసారించాడు. అలా పబ్లిక్ సర్వీసెస్ వైపు మరింత ఆసక్తి పెంచుకున్నాడు. బీటెక్ పూర్తి కాగానే మైనింగ్ ఇంజినీర్‌గా ఛత్తీస్‌గఢ్, వెస్ట్‌బెంగాల్ రాష్ర్టాల్లో కోల్ ఇండియాలో పనిచేశాడు. తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు.
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రాగానే మంచి జీతం ఉన్న మైనింగ్ ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కి వచ్చాడు. తర్వాత యూపీఎస్సీ కోచింగ్ కోసం బెంగళూరు వెళ్లాడు. అకడ ప్రిపేర్ అవుతున్న టైం లోనే తండ్రి మరణించాడు. అయినప్పటికీ మానసికంగా కుంగి పోకుండా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌తో గ్రూప్-4లో సత్తా చాటి పెద్దపల్లి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వచ్చిన గ్రూప్-2 ఫలితాల్లో 143వ ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన గ్రూప్-3లో 21వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు. ప్రతి రోజూ న్యూస్ పేపర్స్ రీడింగ్, ప్రభుత్వ వెబ్ సైట్స్ తన ఉద్యోగ సాధనలో ప్రధానమని, ప్రతీ రోజు 10 నుంచి 12 గంటలు చదివానని, సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మహేశ్‌గౌడ్ చెబుతున్నాడు.