ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. మిడ్‌మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఎల్4 కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లు రాక సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రతి సీజన్లో రోజుకు 200 క్యూసెక్కుల నీటిని వదలాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 100-110 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. దీనికి తోడు పైన ఉన్న కొందరు రైతులు అనధికారికంగా కరెంట్ మోటార్లతో నీటిని తోడేసుకుంటుండగా, చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితులు ఉన్నాయి. దీంతో తిమ్మాపూర్ మండలం పోరండ్ల పరిధిలో వందల ఎకరాల్లో పంటలు చేతికొచ్చే దశలో దెబ్బతింటున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో నీళ్లు రాకపోతే మొత్తానికి ఎండిపోనున్నాయి.
కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : మిడ్‌మానేరు జలాశయం పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ 4ఎల్ కాలువ కింద తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల ఆయకట్టు ఉన్నది. చిగురుమామిడి మండలంలో పీచుపల్లి వద్ద మొదలై.. తిమ్మాపూర్ మండలంలో పర్లపల్లి నుంచి నల్లగొండ, మక్తపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పోరండ్ల, మానకొండూర్ మండలం పెద్దూరుపల్లి, చెంజర్ల, గంగిపల్లి వరకు ఈ కాలువ విస్తరించి ఉన్నది. దీని పరిధిలో మైనర్ కాలువలు ఉండగా, సుమారు 21 వేల ఆయకట్టు ఉన్నది. దీనికోసం ప్రతిరోజూ 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నది.
గతంలో ఈ మేరకు నీటిని విడుదల చేస్తే ఎల్4 కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నిండడమే కాకుండా.. చివరి ఆయకట్టు వరకు నీరందేదని రైతులు చెబుతున్నారు. కానీ, ఈ యాసంగి సీజన్లో మాత్రం 110 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారని, దీంతో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికే ఎల్4 కాలువ పరిధిలోని ఎల్14 ఉప కాలువ కింద పోరండ్లలో చేతికి వచ్చిన పంటలు దెబ్బ తింటున్నాయి. పోరండ్ల పరిధిలోని జంగుట్ట వరకు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. ఈ గుట్ట కింది ప్రాంతంలో ఉన్న పంటలు క్రమంగా ఎండి పోతున్నాయి. ఎండల ప్రభావంతో బావులు, బోర్లు అడుగుంటుతున్నాయి. నాలుగైదు రోజుల్లో నీళ్లు వస్తేనే ఈ పంటలు చేతికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి.

Karinnagar2
ఆయకట్టు చివరకు అందని నీళ్లు
అసలే నీటి కేటాయింపు తక్కువ కావడంతో నీటి వేగం మందగించి వస్తున్నది. దీనికి తోడు పై ఆయకట్టు రైతులు ఎల్4 కాలువపై పెద్ద సంఖ్యలో మోటర్లు వేసి నీటిని పంటలకు తరలిస్తున్నారు. అయితే కింద ఆయకట్టుకు నీరందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. తమ పంటలు ఎందుకు ఎండాలని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ కాలువ పరిధిలోని ఎల్14 మైనర్ కాలువకు మానకొండూర్ మండలం పెద్దూరుపల్లి వద్ద కొద్ది దూరం కాలువ తవ్వాల్సి ఉన్నది.
ఇక్కడ ఒక పెద్ద బండ అడ్డుగా ఉండడంతో వదిలేసి దానికి అటు ఇటు కాలువ తవ్వారు. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తేనే ఈ పరుపు బండ మీదుగా నీళ్లు కింది కాలువకు వెళ్లే అవకాశం ఉంటుంది. నీటి ప్రవాహం తక్కు వ ఉండడంతో నీళ్లు కిందికి రావడం లేదు. ఇక్కడి రైతులు కూడా కిందికి నీళ్లు రాకుండా ఓటీలు తెరుస్తున్నారని, ప్రతి రోజూ రాత్రి వేళ వెళ్లి అక్కడే కాపలా పడుకోవాల్సి వస్తున్నదని పోరండ్లకు చెందిన రైతులు వాపోతున్నారు. నీళ్ల కోసం రైతుల మధ్య నిత్యం గొడవలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుండగా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఎండుతున్న పంటలు
పూర్తి స్థాయిలో నీటిని కేటాయించక పోవడంతో ఎల్4 పరిధిలోని ఎల్14 మైనర్ కాలువకు నీళ్లు రాక పోరండ్ల పరిధిలో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. సుమారు 60 మంది రైతుల పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. ఓ రైతు సాగు చేసిన ఆయిల్ పామ్ పంటను రక్షించుకునేందుకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టిస్తున్నాడు. వరికి నీళ్లందక క్రమంగా ఎండుముఖం పడుతున్నదని ఆవేదన చెందుతున్నాడు. 2 లక్షలు పెట్టి ఎనిమిదిన్నర ఎకరాలు కౌలుకు తీసుకుంటే కాలువ నీళ్లు రాక తాను తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని మరో రైతు కంటతడి పెడుతున్నాడు. ఇలా ఈ ప్రాంతంలోని ప్రతి రైతు గుండె చెరువవుతున్నది. చేతికి వచ్చిన పంటలకు సాగు అందక ఎండి పోతుంటే తట్టుకోలేక పోతున్నారు.
నీళ్లివ్వాలని వేడుకోలు
కాలువకు పూర్తి స్థాయిలో నీళ్లిచ్చి తమ పంటలను కాపాడాలని ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పోరండ్లకు చెందిన ఆశోద రాజుతోపాటు మరి కొందరు రైతులు కలెక్టర్ చిత్రా మిశ్రాకు విన్నవించారు. అయితే ఎండిపోయే దశలో ఉన్న రాజు పంట వరకు అధికారులు నీళ్లిచ్చారు. ఆయన తర్వాత ఉన్న ఆయకట్టుకు మాత్రం రావడం ఇప్పటి వరకు రావడం లేదు. నీటిపారుదల శాఖ డివిజన్ నంబర్ 2 అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోరండ్లకు చెందిన రైతులు వాపోతున్నారు.
ఇటు మానకొండూర్ మండలం గంగిపెల్లికి చెందిన రైతులు కూడా పంటలు కూడా ఎండి పోతున్నాయని కలెక్టర్‌కు మొరపెట్టుకుంటే కొంత ప్రాంతానికి నీళ్లు వెళ్లాయని, అయితే పూర్తి స్థాయి ఆయకట్టుకు మాత్రం ఇప్పటి వరకు నీళ్లు అందలేదని చెబుతున్నారు. ఎల్4 కాలువకు నీటి డిశ్చార్జ్ పెంచితేనే చివరి ఆయకట్టు చివరి వరకు నీరందుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పోయిందని, ఉన్న పంటలనైనా రక్షించుకునేందుకు కాలువ సామర్థ్యం మేరకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నిరుడు యాసంగిలో పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేయడంతో పుష్కలంగా నీళ్లు గుర్తు చేస్తున్నారు. పెద్దూరుపల్లి వద్ద మిగిలిన ఎల్14 కాలువను కూడా తవ్వితే తమకీ పరిస్థితి ఉండదని పోరండ్ల రైతులు వాపోతున్నారు.
కౌలుకు పట్టిన.. మునిగెతట్టున్న
నా గోస చెప్పుకునే తట్టు లేదు. రెండు లక్షలు పెట్టి ఎనిమిదిన్నర ఎకురాలు కౌలుకు పట్టిన. ఐదెకరాల్లో మక్క పెట్టిన. మూడు ఎకరాలు ఎండి పోయింది. ఇక రెండెకరాలు ఎండి పోయేటట్టే ఉన్నది. ఇంకో మూడున్నర ఎకరాల్ల వరి పెట్టిన. ఇది కూడా ఎండి పోతున్నది. నీళ్లందకపోతే వారం పదిరోజుల్ల మొత్తం పోతది. నిరుటి లెక్కనే నీళ్లు వస్తయని ఆశపడి పైసలు ఎక్కువైనా సరేనని కౌలుకు పట్టిన. ఇంత పనైతదని అనుకోలే. నాలుగైదు రోజుల్ల నీళ్లు వస్తెనే మా పంటలు చేతికి వస్తయి. లేదంటే అన్నీ ఎండి పోతయి. సచ్చుడో బతుకుడో అర్థమైత లేదు. గతంల ఈ టైంకు మా ఊర్లె చెరువులు మత్తళ్లు పడినయి. ఇపుడు ఎండిపోయి కనిపిస్తున్నయి.
– చిర్ర రాజేశం, రైతు (పోరండ్ల)
బావులు, బోర్లు అడుగంటినయ్
కాలువ నీళ్లు రాక బావులు, బోర్లు మొత్తం ఎండిపోయినయి. నాకున్నది ఒక్క ఎకరం మాత్రమే. బావి ఎండిపోవడంతో నీళ్లు అందుతలేవు. అంత అదిలి పోయింది. ఇప్పుడు నీళ్లు పెట్టినా పారది. వరి మొత్తం పొట్టకచ్చినంక ఇట్లయ్యింది. ఏం చెయ్యాలో తెలుస్త లేదు. నిరుడు ఈ టైంకు కూడా బావిల నీళ్లుండే. పంట చేతికి వచ్చినంక కూడా నీళ్లు ఒడవలే. అసొంటిది ఇప్పుడు మధ్యలనే ఎండిపోయింది. కాలువ నీళ్లు వస్తే ఇంత పాపం జరిగేది కాదు.
– నాగపూరి అంజయ్య, రైతు (పోరండ్ల)
కలెక్టర్‌కు మొర పెట్టుకున్నం
పంటలు ఎండి పోతున్నయని మొన్నటి సోమవారం కలెక్టరేట్‌కు పోయి ప్రజావాణిలో మొర పెట్టుకున్నం. దీంతోని కొందరికి నీళ్లచ్చినయి. కానీ, చాన మందికి ఇంకా నీళ్లు రాలే. నీళ్లు మొత్తం ఇస్త లేరు. ఎందుకని అధికారులను అడిగితే ఎవరు సమాధానం చెప్తలేరు. ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేస్తే చేస్తం చూస్తమని చెబుతున్నరు. పైన ఉన్న రైతులు కింది రైతుల కోసం కూడా ఆలోచించాలే. మేం కూడా మీలెక్కనే కాలువ మీద ఆధారపడి పంటలు ఏసుకున్నం. మాకు వచ్చే నీళ్లు మాకు రానియ్యాలే. అధికారుల కూడా మాకు నీళ్లు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలె.
– ఆశోద రాజు, రైతు (పోరండ్ల)