Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాగులు, వంకలకు పునరుజ్జీవం వచ్చింది. పుష్కలమైన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వాగులపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని మానేరు, కల్వల, చిలుక, వీణవంక వాగులపై చేపట్టిన అనేక చెక్ డ్యాంలు పూర్తికాగా, మరి కొన్ని ప్రగతిలో ఉన్నాయి. పూర్తయిన చెక్ డ్యాంలు నిండు వేసవిలోనూ నీటితో కళకళలాడుతుండగా, వీటి పరిధిలో భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు ఏటా రెండు పంటలకు సరిపడా నీరు సమృద్ధిగా లభిస్తున్నది.
కరీంనగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పలు వాగులపై ఇప్పటి వరకు 14 చెక్ డ్యాంలు నిర్మించింది. ఇందులో హుజూరాబాద్ వద్ద చిలుకమ్మ వాగుపై రూ.95 లక్షలతో, ఇల్లందకుంట మండలంలోని మల్యాల వాగుపై రూ.82 లక్షలతో, పాతర్లపల్లి వద్ద రూ. 1.24 కోట్లతో, వంతడుపులలో రూ.45 లక్షలతో స్థానిక వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించారు. జమ్మికుంట మండలం విలాసాగర్ వద్ద రూ.12.77 కోట్లతో, వావిలాల వద్ద రూ.9.83 కోట్లతో మానే రు వాగుపై నిర్మించారు. ఇక వీణవంక మండలం కోర్కల్ వద్ద రూ.12.56 కోట్లతో, లక్ష్మక్కపల్లి వద్ద రూ.2.53 కోట్లతో, పోతిరెడ్డిపల్లి వద్ద రూ.2.95 కోట్లతో, రామకృష్ణాపూర్ వద్ద రూ.2.39 కోట్లతో, వీణవంక వద్ద రూ.1.97 కోట్లతో నిర్మించారు. ఇదే మండలం మల్లారెడ్డిపల్లి, కొండపాక, బ్రాహ్మణపల్లి గ్రామాల వద్ద కొత్తగా మరికొన్ని చెక్ డ్యాం లు నిర్మిస్తున్నారు. కరీంనగర్ మండలం నగునూ ర్, గోపాల్పూర్ గ్రామాల మధ్య స్థానిక వాగుపై రూ.12.79 కోట్లతో చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జి నిర్మా ణం పూర్తి చేశారు. ఎలబోతారం, గోపాల్పూర్ గ్రామాల మధ్య ఒకటి, ముగ్దుంపూర్ వద్ద ఒకటి, ఇరుకుల్ల, వంతడుపుల గ్రామాల మధ్య మరొక చెక్ డ్యాం పూర్తి చేశారు.మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా బొమ్మ కల్, చేగుర్తి మధ్య మరో రెండు చెక్ డ్యాంల నిర్మాణం కోసం ప్రతిపాదించారు. మానకొండూర్ మండలం పరిధిలోని లింగాపూర్, శ్రీనివాస్‌నగర్ మధ్య మానేరు వాగుపై రూ.18.16 కోట్లతో ఒక చెక్‌డ్యాంను నిర్మించారు. ఇదే మండలంలోని ఊటూరు, వేగురుపల్లి మధ్య రూ.27. 47 కోట్లతో మరో చెక్ డ్యాం నిర్మాణంలో ఉన్నది.
ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులు, వంకల్లో ఒకప్పుడు మూడు కాలాలపాటు నీళ్లు పారుతూ కనిపించేవి. ఎన్నో జీవరాసులు వాటిపై ఆధారపడి జీవించేవి. వాగు నీళ్లను రైతులు పొలాలకు మళ్లించి సమృద్ధిగా పంటలు పండించుకునేది. కాలువల ద్వారా చెరువులకు నీళ్లు మళ్లించుకునేది. ప్రధానంగా గోదావరి ఎగువ ప్రాంతంలో పారే జిల్లాలోని మానేరు, మల్యాల, కల్వల, వీణవంక, చిలుక వాగులు వట్టిపోయి కనిపించేవి. జల వనరులు ఇంకి పోయి ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నది. కాలువ ద్వారా నీటిని పంటలకు తరలించిన రైతులు బోర్లు వేసుకున్నా ఆశించిన నీరు లభించని పరిస్థితి. జిల్లాలో వట్టిపోయిన అనేక వాగులు, వంకలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి జీవం పోయాలనే సంకల్పంతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది. మానకొండూర్, వీణవంక, జమ్మికుంట మండలాల్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలలో నిత్యం నీళ్లు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో స్థానికంగా ఉన్న వాగులపైనా నిర్మించారు. ఫలితంగా ఎక్కడెక్కడ చెక్ డ్యాంలు నిర్మించారో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు ఏటా రెండు పంటలు సాగు చేసుకుని, మంచి దిగుబడి పొందుతున్నారు. ఈ చెక్ డ్యాంల కారణంగా పర్యావరణం కూడా అభివృద్ధి చెందుతోంది. పక్షులు, ఇతర జీవరాశులు చెక్‌డ్యాం సమీపంలో ఆవాసాలు ఏర్పర్చుకుంటున్నాయి. చెక్ డ్యాంల నిర్మాణంలో పర్యావరణంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి.