కరీంనగర్ రూరల్, డిసెంబర్ 12 : ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వాసర గార్డెన్లో గురువారం జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్ అధ్యక్షతన సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేప పిల్లలకు బదులుగా డబ్బులు ఇస్తే ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి, చెరువులో వేసుకుంటామని చెప్పారు.
వీణవంక మండలంలోని ఒకే గ్రామంలో రెండు సంఘాలు ఏర్పాటు చేయడం సరికాదని, గ్రామానికి ఒకటే ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చేపపిల్లలు ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. మత్స్య కారులకు ప్రత్యేకంగా పింఛన్లు ఇప్పించాలని, చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులకు నేషనల్ ఫిష్ డెవలప్ ఫెడరేషన్ (ఎన్ఎఫ్డీపీ)ద్వారా గుర్తింపు కార్డులు జారీ కోసం సభ్యులు సహకారం అందించాలని జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ కోరారు.
మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టీ విజయ భారతి మాట్లాడుతూ, సొసైటీ రికార్డుల నిర్వహణపై, జిల్లాలలోని ప్రతి ప్రాథమిక సహకార సొసైటీ మూడు నెలలకు ఒక సారి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ మెనేజింగ్ డైరెక్టర్ జీ మంజుల, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు కుమారస్వామి, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.