కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 26: సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. బుధవారం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వేర్వేరుగా ధర్నా చేశారు. కాంగ్రెస్ పాలనలో కార్మికుల సంక్షేమం అటకెక్కిందని, తమ బతుకులు ఆగమవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. గంటకు పైగా ఆందోళన చేపట్టిన అనంతరం కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందజేసి, సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ధర్నా చేయగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడు నెలలుగా జీపీ కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబాలు పస్తులుండే పరిస్థితులు దాపురించాయని వాపోయారు.
కార్మికులకు అందజేయాల్సిన సబ్బులు, డ్రెస్సులు, కొబ్బరినూనె, శానిటరీ వస్తువుల పంపిణీ కూడా నిలిపివేశారని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి పాల్గొని మాట్లాడారు. నూతన పీఆర్సీలో కార్మికుల వేతనాన్ని కనీసం 26వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆరోగ్యమే శ్రేయస్సుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు అడుగడుగునా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ఆర్టీనెం.60, 63లో నిర్ణయించిన మేరకు కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని సూచించారు. ధర్నా కార్యక్రమాల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ప్రతినిధులు రాచర్ల మల్లేశం, రవీందర్రావు, కాశిపాక శంకర్, వడ్లూరి లక్ష్మీనారాయణ, బొజ్జ మధురమ్మ, స్వరూప, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అశోద రవీందర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యూ శ్రీనివాస్, పోచయ్య, దదాసరి రాజమల్లయ్య, కే రవి, ఎండీ అజ్జు, అంజయ్య, శంకరయ్య, బుజ్జమ్మ, సరోజ ఉన్నారు.