కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. ఇప్పటికే తొలి, మలి విడుత పూర్తి కాగా, ఆఖరి విడుతపైనే అందరి దృష్టీ నెలకొన్నది. బుధవారం పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిబంధనల మేరకు 44 గంటల ముందే అంటే.. సోమవారం సాయంత్రం 5గంటలకే ప్రచారం ముగిసింది. ఇక ప్రలోభాలకు తేరలేవనుండగా, యంత్రాంగం పకడ్బందీ నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకోనున్నది. ఈ నెల 9న మూడో దఫా అభ్యర్థుల జాబితా ప్రకటించగా, 19 మండలాల పరిధిలో మొత్తం 408 సర్పంచ్ స్థానాలకు 22 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
మిగిలిన 386 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 3736 వార్డు స్థానాలకు 931 ఏకగ్రీవం కాగా, మిగిలిన 2805 స్థానాలకు ఎన్నికలు ఉండనున్నాయి. మరో 24 గంటల్లో ఎన్నికలు ఉండగా, అభ్యర్థులు గెలుపు కోసం చివరి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విజయమే లక్ష్యంగా చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి, రెండు విడుతల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటగా, మూడో విడుతలోనూ మెజార్టీ స్థానాలను దక్కించుకునే అవకాశమున్నదని భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా : వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్(వీ)
జగిత్యాల జిల్లా : ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల
రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట