పెద్దపల్లి, డిసెంబర్ 6: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి అకాల వర్షంతో ధాన్యమంతా నీళ్లపాలైంది. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లన్నీ తడిసిపోయాయి. టార్ఫాలిన్లు కప్పినప్పటికీ కుప్పల్లోకి నీళ్లు చేరాయి. మాయిశ్చర్ రాని కారణంగా తూకం వేయడంలో ఆసల్యం కావడం వల్ల అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోయాల్సి వచ్చింది. ఆర్నెళ్లు అరిగోస పడి పండిస్తే అకాల వర్షం ఆగం చేసిందని రైతులు వాపోయారు. తడిసిన వడ్లను ప్రభుత్వం కటింగ్ లేకుండా కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రెండెకరాల్లో సన్నవడ్లు పండించిన. రెండు ట్రాక్టర్ లోడ్లు అయినయ్. నాలుగు రోజుల కింద మార్కెట్‌కు తెచ్చిన. పగటీలు ఆరబెట్టి.. రాత్రికి కుప్ప చేసేది. రేపో మాపో కాంటా పెడుతారనుకున్న. నిన్న మబ్బు లేదని కుప్ప చేయలేదు. చెడగొట్టు వాన నడిజాం రాత్రి కొట్టింది. తెల్లారి వచ్చి చూచే సరికి వడ్లన్నీ తడిసినయ్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తడిసిపోయింది. పోయినేడు దొడ్డు వడ్లు వేస్తే 3 ట్రాక్టర్ల లోడ్ల వడ్లు పండినయ్. బోనస్‌కు అశపడి సన్న వడ్లు పండిస్తే రెండు ట్రాక్టర్ లోడ్ల వడ్లు వచ్చినయ్. అవి కూడా తడిసి పోయినయ్. పెట్టుబడి కూడా వచ్చేటట్టు కనిపిస్తలేదు. తడిసిన వడ్లు ఎన్నడు ఆరాలె. ఎప్పుడు అమ్ముకోవాలె. అటు సర్కారు, ఇటు ప్రకృతి రైతుకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చినయి.