ఎల్లారెడ్డిపేట, మే 4: కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. రైతన్నకు శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట దొంగల పాలవుతున్నది. ఇందుకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జరుగుతున్న వరుస ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత నెల 30న వ్యవసాయ మార్కెట్ గోదాం సమీప కొనుగోలు కేంద్రంలో రైతు నీరటి గోపాల్ ఎండబోసిన పదిబస్తాల ధాన్యం మాయమైంది. ఇది మరిచిపోక ముందే తాజాగా అదే గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాస్‌రెడ్డి ధాన్యం కనిపించకుండా పోయింది.
పదిహేను రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో 12 నుంచి 13 క్వింటాళ్ల ధాన్యం కుప్పగా పోశాడు. అధికారులు రేపు.. మాపంటూ కాంటా పెట్టకపోవడంతో ఇదే అదనుగా దొంగలు దోచుకెళ్లారు. ఆదివారం రైతు సెంటర్‌కు వెళ్లి చూస్తే ధాన్యం ఆనవాళ్లే లేకుండా పోగా లబోదిబోమంటున్నాడు. కొనుగోలు కేంద్రంలో ఎండబోసిన, కుప్పలుగా ఉంచిన 77 మంది రైతులకు చెందిన దొడ్డు వడ్లు, 18 మంది రైతులకు చెందిన సన్న వడ్లు కొనాల్సి ఉండగా వారంతా తమ ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.
నాకున్న 19 గుంటల భూమిల ఎల్లిన 12 నుంచి 13 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు కేంద్రానికి తెచ్చి 20 రోజులైంది. రెండు రోజులకే మాయిచ్చర్ వచ్చిందన్నరు. కానీ, ఇంకా కాంటా పెట్టలే. నా సీరియల్ నంబర్ వచ్చే వరకు ఇంక నాలుగైదు రోజులు పడ్తది అంటే ఇక్కన్నే ఎండబోసిన. రాత్రి కుప్పజేసి ఇంటికి పోయిన. పొద్దుగాల్ల వచ్చేవరకు కుప్పతో పాటు కవర్లు కూడా ఎత్తుకపోయిన్రు. ఇక్కడ ధాన్యం పోసిన ఆనవాళ్లు కూడా లేకుండా దొంగలెత్తుకపోయిన్రు. రోజురోజు లేటయినకొద్ది దొంగలెత్తుకపోవట్టిరి. ఇగ రైతుకేం లాభం జేస్తున్నరు. ఏం మిగులుతది?
– చల్ల శ్రీనివాస్‌రెడ్డి, రైతు (బొప్పాపూర్)