purchasing centers |తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు. మండలంలోని పోలంపల్లిలో రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబోసి ప్రైవేటు వ్యక్తులకు రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్న ప్రాంతంలో సీపీఐ నాయకులు శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మండలంలో వరి కోతలు మొదలైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే రైతులు వడ్లను ఆరబోసి ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు రైతుల వద్ద నుండి ప్రభుత్వ మద్దతు ధర కన్నా రూ.300 తక్కువకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల దోపిడిని అరికట్టి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి ముత్త స్వామి, నాయకులు గుంటి అయిలయ్య, ముత్త మల్లయ్య, శ్రీశైలం, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.