Pegadapally | పెగడపల్లి: పెగడపల్లిలో మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగంవంతం చేయాలని మర్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తేమ శాతం వచ్చిన ధాన్యంను వెంట వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని, గన్నీ సంచుల కొరత లేకుండా చూడటంతో పాటు, తూకం వేగంగా జరిగేందుకు హమాలీల సంఖ్యను పెంచాలని నిర్వాహకులకు సూచించారు.
వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాములుగౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, డైరెక్టర్లు విజయభాస్కర్, కిషన్, మహేష్, తిరుపతి, నాయకులు బలరాంరెడ్డి, తిరుపతి, రమేశ్, సమ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.