కరీంనగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా, కొనుగోళ్లు 58 శాతానికి మించలేదు. ఈ వానకాలం సీజన్లో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేసినా.. ఇప్పటి వరకు కొన్నది 2.31 మెట్రిక్ టన్నులు దాటలేదు. నిజానికి జిల్లాలో వానకాలం సీజన్లో 2,73,397 ఎకరాల్లో వరిసాగు చేయగా, అందులో 1,51,982 ఎకరాల్లో దొడ్డు రకం, 1,21,415 ఎకరాల్లో సన్నరకాలు వేశారు. అందులో 3.17 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు, 2.48 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. అందులో రైతులు తమ అవసరాల కోసం అట్టిపెట్టుకున్నవి తీసివేస్తే మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రావచ్చని అంచనా వేశారు.
అందుకోసం 340 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. కానీ, 329 కేంద్రాలను మాత్రమే తెరిచి ఇప్పటి వరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. అందులో 1.60 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 70.77 వేల మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం ఉన్నది. 3.17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యానికి 1.60 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 50 శాతం మాత్రమే కేంద్రాలకు వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఇక సన్నాల విషయానికి వస్తే 1.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనుకుంటే 70.77 వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. అంటే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, సుమారు 36 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దళారుల పాలైనట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
వారంలో కొనుగోళ్లు నిలిపివేత?
కరీంనగర్ జిల్లాలో ఐకేపీ ద్వారా 48 కేంద్రాలు తెరవగా 42 సెంటర్లను, సహకార సంఘాల ద్వారా 233 కేంద్రాలు తెరవగా 165, డీసీఎంఎస్ ద్వారా 44 కేంద్రాలు తెరవగా 36, హాకా ద్వారా 4 కేంద్రాలు తెరవగా 4.. మొత్తంగా 247 కేంద్రాలను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 82 కేంద్రాలను మరో వారంలో మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వారంలో 6 నుంచి 10 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరగవచ్చని భావిస్తున్నారు.