ధాన్యం దళారుల పాలవుతున్నది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో మధ్య వ్యాపారుల పంట పడుతున్నది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పంట కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నది. సిరిసిల్ల జిల్లాలో ఈ సీజన్లో 241 సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన యంత్రాంగం, ఇప్పటివరకు 139 మాత్రమే ప్రారంభించింది. అందులోనూ కొన్నింట మాత్రమే కొనుగోళ్లు మొదలు పెట్టి అంతంతమాత్రమే సేకరిస్తుండడంతో కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. రాత్రిళ్లూ కేంద్రాల వద్దే పడిగాపులు పడుతూ, అకాల భయంతో వ్యాపారులకు అగ్గువకే అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వేగవంతం చేయాలని రైతాంగం కోరుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. రైతులు కేంద్రాలకు వడ్లు తెచ్చి పదిహేను రోజులైనా కాంటా పెట్టకపోవడం మధ్య దళారులకు కాసుల పంట పండిస్తున్నది. ఓ వైపు అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవుతుండగా, కాపాడుకోలేక రైతాంగం అవస్థలు పడుతున్నది. రోజుల తరబడి వేచిచూడలేక మద్దతు ధర కన్నా తుట్టికే అమ్ముకుంటూ నష్ట పోతున్నది. పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామంటూ సర్కారు చేసిన ప్రచార పటాతోపం తప్ప ఒరిగిందేమి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. సిరిసిల్ల జిల్లాలో ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. అందు కోసం 255 గ్రామ పంచాయతీల పరిధిలో 241 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ, కోతలు మొదలై పదిహేను రోజులు గడిచిన తర్వాత ఇప్పటివరకు కేవలం 139 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
..పక్క చిత్రంలో ధాన్యం రాశులతో కనిపిస్తున్నది సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరు ఐకేపీ సెంటర్. రైతులు ధాన్యం తెచ్చి పదిహేను రోజులు అవుతున్నా ఒక్క గింజా కొనకపోవడంతో కుప్పలు తెప్పలుగా పోగుపడుతున్నాయి. అయితే కొనుగోళ్ల ప్రారంభానికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియకపోవడం, మరోవైపు అకాల భయం వెంటాడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియక దళారులకు అగ్గువకే క్వింటాల్ 1800 నుంచి 1900కే అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా దళారులు సైతం ఐకేపీ సెంటర్ సమీపంలోనే కాంటా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఈ ఒక్క చోటే కాదు జిల్లాలోని మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారుల పరమైనట్లు తెలుస్తున్నది
కేసీఆర్ ప్రభుత్వం వరి కోతలకు ముందే కొనుగోళ్లపై పక్కా ప్రణాళికలతో ముందుకు పోయింది. 255పంచాయతీలుంటే 265సెంటర్లతో కల్లాల వద్దే కాంటాలు పెట్టి కొనుగోళ్లు వేగవంతం చేసింది. రైస్ మిల్లర్లతో ముందస్తు చర్చలు జరిపి వెంటవెంట గోదాములకు తరలించేలా చర్యలు తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోళ్ల ప్రక్రియ ఆగమైందని, రానురాను అధ్వానంగా మారిందని రైతులు మండిపడుతున్నారు. గత 2024 యాసంగిలో ఏప్రిల్ 18 వరకు 18,186.220మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్న అధికారులు, ఈ సీజన్లో కేవలం 139 సెంటర్లు మాత్రమే ప్రారంభించి తూతూమంత్రంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 7,823.120 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు.
కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోతున్నది. రైతులు రాత్రిళ్లు పడిగాపులు కాయాల్సిన దుస్థితి. మరోవైపు రైతన్నకు వడగండ్ల వాన భయం పట్టుకున్నది. ఇటీవల కురిసిన వానలకు మెజార్టీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో కన్నీరే మిగిలింది. ధాన్యం పరిశీలించిన అధికారులు తేమ ఉందని, ఆరే వరకు కొనుగోలు చేయమని చెబుతున్న నేపథ్యంలో మరో పదిరోజులు ఆరపెట్టాల్సిందే. ఈలోగా మళ్లీ వర్షాలు పడితే ధాన్యం తడుస్తున్నది. ఇదే తంతు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు దళారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు. క్వింటాల్ 1800, 1900కే తుట్టికే అమ్ముకుంటూ నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 75వేల మెట్రిక్ టన్నులు దళారీలకు అమ్ముకున్నట్లు తెలుస్తున్నది.