కలెక్టరేట్, మార్చి 03: కరీంనగర్, ఆదిలాబా,ద్ నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి(MLC elections) స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన ఈ కార్యక్రమంలో పోస్టల్ ఓట్ల లెక్కింపుతో పాటు మిగితా ఓట్లను కూడా లెక్కిస్తున్నారు. 21 టేబుల్ ల పై పట్టభద్రుల ఓట్లను, 14 టేబుల్ లపై ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు పట్టభద్రుల ఓట్లకు సంబంధించి 60 బ్యాలెట్ బాక్సులు, 18 ఉపాధ్యాయుల ఓట్ల బ్యాలెట్ బాక్సుల లెక్కింపు పూర్తయింది. మొదటగా ఆదిలాబాద్ జిల్లాలోని పోలింగ్ బాక్సుల లెక్కిస్తున్నారు.
అయితే ఈ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా మూడు జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓట్లు సమానంగా పంచుకుంటారని అంచనాలు ఉండగా, అదే స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ లకు ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. కాగా ప్రతి బాక్స్ లో కనీసం 30 నుంచి 40 శాతం ఓట్లు చెల్లనివిగా గుర్తిస్తున్నట్లు లెక్కింపు సిబ్బంది పేర్కొంటున్నారు. చెల్లని ఓట్లు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మరింత టెన్షన్ పెరుగుతోంది. కాగా, మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపోటములు ఖరారయ్యే అవకాశాలు ఉంటాయని, పరిశీలకులు భావించారు.
కానీ లెక్కింపులో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటంతో, రెండో ప్రాధాన్యత ఓట్ల పైనే ఫలితం ఆధారపడి ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటివరకు 70 వరకు మాత్రమే బ్యాలెట్ బాక్సుల నుంచి చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను వేరు చేయగా ఇంకా 400 పైగా బాక్సులు తెరవాల్సి ఉన్నది. అలాగే ఉపాధ్యాయుల శాసనమండలి స్థానానికి సంబంధించి 95 బాక్సుల నుంచి బ్యాలెట్ పేపర్లు వేరుచేయగా, ఈరోజు అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయుల బ్యాలెట్ బాక్సులు మొత్తం తెరిచే అవకాశాలున్నాయి.
ఈ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో మల్కా కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓట్లు అధిక సంఖ్యలో పడ్డట్లు లెక్కింపు సిబ్బంది ద్వారా తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఉపాధ్యాయ స్థానం ఫలితం ఈరోజు అర్ధరాత్రి అనంతరం తేలే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మూడు షిఫ్టుల్లో ఓట్ల లెక్కింపు చేపడుతుండగా, ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మొదటి షిఫ్ట్ పూర్తి కాగా, రెండో షిఫ్ట్ లో ఓట్ల లెక్కింపు కు ఎన్నికల సిబ్బంది విధుల్లో చేరారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాల ఎన్నికల పరిశీలకులు, మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వయంగా పర్యవేక్షిస్తూ ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు.