మండలి పోరు ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ సాగగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ‘పట్టభద్రుల’కు 70.42 శాతం, ‘ఉపాధ్యాయుల’కు 91.90 శాతం నమోదైంది. పోలింగ్ అనంతరం నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి తరలించి, ఇండోర్‌స్టేడియంలో భద్రపరిచారు. వచ్చే సోమవారం ఫలితాలను ప్రకటించనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, 15 జిల్లాల్లో 499 పట్టభద్రుల, 274 ఉపాధ్యాయుల, 99 కామన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైనా.. పది గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదిలారు. మధ్యాహ్నం వరకు పుంజుకోగా, 2గంటల తర్వాత పెద్దసంఖ్యలో బారులు తీరి కనిపించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా క్యూలో నిల్చొని ఉత్సాహంగా ఓటు వేశారు.
సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియాల్సి ఉండగా, ఆ సమయంలోగా కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అక్కడక్కడ రాత్రి ఏడు గంటల వరకు కూడా ఓపికతో ఉండి ఓటు వేశారు. అభ్యర్థులతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లకు 2,50,106 మంది (70.42 శాతం), ఉపాధ్యాయ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లకు 24,895 మంది (91.90 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 1,60,321 మంది పట్టభద్రులకు 1,07,712 (67.18 శాతం) మంది.. 8,135 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 7,454 (91.62 శాతం) మంది ఓటు వేశారు. అయితే ఈసారి పట్టభద్రులతో పోలిస్తే ఉపాధ్యాయులు ఓటెత్తారు. ప్రభుత్వం క్యాజువల్ సెలవులు మంజూరు చేయడంతో ఎక్కువశాతం ఓటు వేశారు. అయితే అక్కడక్కడ అరకొర ఏర్పాట్లు చేయడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు గంటల తరబడి లైన్లలో ఉండాల్సి వచ్చిందని వాపోయారు.
క్యూలో నిల్చున్న ఓటర్లకు నీడనిచ్చేలా టెంట్లు ఏర్పాటు చేయలేదని, తాగునీటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు. పోలింగ్ ముగిసిన అనంతరం నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లాకేంద్రానికి తరలించారు. రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్స్‌లను అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్ రూంలకు మూడంచెల పద్ధతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3న అంటే వచ్చే సోమవారం కౌంటింగ్ చేసి, ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్‌లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కూడా జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దక్షిణాది రాష్ర్టాల్లో జనాభా లెక్కల ప్రకారం పార్లమెంట్ సీట్లు తగ్గిస్తే ఎవరూ ఊరుకోరు. అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తే సీట్లు తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని మేం అనుకుంటున్నాం. ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు గెలిచినా పట్టభద్రుల సమస్యలకు పరిమితం కాకుండా, విద్యా విధానం, నైపుణ్యత పెంచే విషయంపై మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో నూతన ఒరవడిలో విద్యా విధానం కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉన్నది.
– కరీంనగర్ వాణీనికేతన్ కళాశాలలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాజీ ఎంపీ వినోద్‌కుమార్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి. నేను మొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నా. ఎవరు గెలిచినా రాజకీయ పార్టీల పరంగా కాకుండా ఓట్లు వేసిన పట్టభద్రుల సమస్యలపై మాట్లాడాలి. శాసనమండలిలో ప్రభుత్వానికి, పట్టభద్రుల వారధిగా పనిచేయాలి.
– కరీంనగర్ వాణీనికేతన్ కళాశాలలో ఓటు వేసిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్