హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 1: పట్టణంలో మినీ స్టేడియం కోసం ప్రభుత్వాన్ని, ఇకడి కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు. ఒక క్రీడాకారుడిగా తాను, హుజూరాబాద్‌లోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మినీ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సకల ప్రయత్నాలు చేసినప్పటికీ, కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో రాష్ట్రస్థాయి హాకీ పోటీల ముగింపు వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా కోపం ఉంటే తనమీద తీర్చుకోవాలి తప్ప, క్రీడాకారులపై కాదన్నారు.
పట్టణంలో మినీ స్టేడియం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి రూ.పది కోట్లు తీసుకువచ్చానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 28, 2023లో స్పోర్ట్స్ గ్రౌండ్‌కు 10 కోట్ల రూపాయల టెండర్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మినీ స్టేడియం కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మినీ స్టేడియం కోసం తాను 10 కోట్ల రూపాయలు తీసుకువస్తే, కొంతమంది జోకర్లు మైదానం అభివృద్ధి కోసం కేవలం రూ. 10 లక్షలు తెచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హుజూరాబాద్‌లో అద్భుతమైన గ్రౌండ్ ఏర్పాటు చేయాలని తాను కన్న కలలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని విచారం వ్యక్తంచేశారు. ప్రతి క్రీడాకారుడికి, అన్నా అంటే నేనున్నానని స్పందిస్తానని హామీ ఇచ్చారు.
హుజూరాబాద్‌లో కూడా హైడ్రా పేరుతో ప్రతాపవాడ, కిందివాడకు సంబంధించి పరిశీలన జరిగినట్లు తెలుస్తున్నదని, ఏదైనా పేదవాడి ఇంటిని కూలగొట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదవాడి ఇంటికి వచ్చి బెదిరిస్తే, తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఏ రాత్రి అయినా సరే వచ్చి మీతోనే ఉంటానని హామీ ఇచ్చారు. తనమీద కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే జైల్లో పెట్టిన పర్వాలేదని, పేదవాడి జోలికి వస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, హాకీ కోచ్‌లతోపాటు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటా
నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పట్టణం, పలు గ్రామాల్లో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన వారి ఇండ్లకు ఆదివారం స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే.. సీఎంఆర్ఎఫ్ చెకులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలన్నారు. సమస్యల పరిషారానికి కృషి చేస్తానన్నారు.
అట్టహాసంగా హాకీ పోటీల ముగింపు వేడుకలు
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 68వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల హాకీ పోటీల ముగింపు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఫైనల్ పోటీల్లో కరీంనగర్ బాలికలు, ఆదిలాబాద్ బాలుర జట్లు గెలిచి, కప్ సాధించాయి. నిజామాబాద్ బాలికల, బాలుర జట్లు రన్నరప్‌గా నిలిచాయి. హుజూరాబాద్ పట్టణానికి చెందిన అవిఘ్న, సహస్ర, మైటీ, మిథున, పర్ణిత, సాయినాథ్, దుర్గరాజు మధ్యప్రదేశ్‌లో జరుగబోయే జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ముగింపు వేడుకలకు హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, విజేతలకు బహుమతులు ప్రదానం చేయగా, స్థానిక నాయకులు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హాకీ క్రీడాకారుల ఆటను చూస్తుంటే తాను క్రికెట్ ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. హాకీ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో మెడల్ సాధించాలని ఆకాంక్షించారు.