Coal City | కోల్ సిటీ, అక్టోబర్ 16: రామగుండం నగర పాలక సంస్థలో రోడ్ల నిర్మాణంలో వస్తున్న ఆరోపణలపై అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇటీవల నగరంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో తనిఖీలకు సిద్ధమైంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ ఆదేశాలతో ఆర్ అండ్ బీ అధికారులు గురువారం పలు డివిజన్లలో కలియ తిరిగారు.
కాగా, గత నెల 22వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘క్వాలిటీ కంట్రోల్ తప్పుతోంది…’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. బల్దియాలో థర్డ్ పార్టీ సర్టిఫికెట్ జారీలో కాంట్రాక్టర్ల మామూళ్లతో మమా అనిపిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలతో తెరపైకి తీసుకవచ్చింది. ఈ కథనంకు స్పందించిన నగర పాలక సంస్థ కమిషనర్ అరుణ శ్రీ రోడ్డు నాణ్యత ప్రమాణాలను పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించగా, గురువారం ఆర్ అండ్ బీ ఏఈ జావీద్, డీఈ జాఫర్ లు ముందుగా స్థానిక సప్తగిరి కాలనీ ఏరియాలో గతంలో నిర్మించిన సిమెంట్ రోడ్డు నాణ్యతను పరిశీలించారు. పరీక్షల నిమిత్తం మిశ్రమంను సేకరించి వెంట తీసుకవెళ్లారు.. అనంతరం లక్ష్మీనగర్ తోపాటు పలు డివిజన్లలో పూర్తయిన రోడ్ల నాణ్యతను సైతం పరిశీలించారు. అధికారులు క్షేత్ర స్థాయిలోకి రావడంతో కాంట్రాక్టర్లు జాగ్రత్తలు పడుతున్నట్లు వినికిడి.
కాగా, రోడ్డు నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్న సమయంలో కాంట్రాక్టర్లు అక్కడే ఉండటం పట్ల ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. రోడ్డు నాణ్యతను పరిశీలించిన అధికారులు మార్గదర్శకాలను అమలు చేస్తారా..? లేక ఎప్పటిలాగే లాంఛన ప్రాయమేనా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగా కాంట్రాక్టర్ల ప్రలోభాలకు తలొగ్గి నాణ్యత పరిశీలనలో రాజీ పడుతారా…? లేదంటే నిగ్గు తేలుస్తారా అని పలువురు చర్చించుకుంటున్నారు.