సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం దిగొచ్చింది. మరమగ్గాలకు 10 హెచ్‌పీల విద్యుత్ లిమిట్‌ను 25 హెచ్పీలకు పెంచుతూ ఈఆర్సీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యూనిట్ విద్యుత్‌కు 8.8ల నుంచి 4కు తగ్గనున్నది. కాగా, ఈ నిర్ణయంతో 30 వేల మరమగ్గాలకు ప్రయోజనం చేకూరనున్నందున నేత కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల నేతన్నలకు ఊరట లభించింది. ఇప్పటి వరకు 10 హెచ్‌పీల వరకు మాత్రమే ఉన్న విద్యుత్ సబ్సిడీ ఇక నుంచి 25 హెచ్‌పీల వరకు వర్తించనున్నది. ఈ నెల 25న సిరిసిల్ల పద్మనాయక కల్యాణమండపంలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చార్జీల పెంపుపై బహిరంగ విచారణ చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పలు అంశాలను ఈఆర్సీ ద్వారా ప్రభుత్వానికి సూచనలు, డిమాండ్లను చేశారు. అందులో పాల్గొన్న ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగరావు, కేటీఆర్ చేసిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మొదట విద్యుత్ చార్జీలు పెంచాలన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అనంతరం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలంటే 10 హెచ్‌పీల లిమిట్ ఉన్న విద్యుత్‌ను 30 హెచ్పీలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన డిమాండ్‌కు తలొగ్గిన సర్కారు వస్త్ర పరిశ్రమను కుటీర పరిశ్రమ కింద గుర్తించింది. 10 హెచ్‌పీల విద్యుత్ లిమిట్‌ను 25 హెచ్పీలకు పెంచింది.
సోమవారం హైదరాబాద్‌లో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు విలేకరుల సమావేశం నిర్వహించి, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విద్యుత్ రాయితీని ప్రకటించారు. 30 హెచ్పీలకు పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేయగా, 25 హెచ్పీలకు పెంచుతున్నట్టు చెప్పారు. త్వరలో ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. వస్త్ర పరిశ్రమలో దాదాపు 30 వేల మరమగ్గాలున్నాయని, వేలాది మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఈఆర్సీ ప్రకటించిన విద్యుత్ రాయితీతో 25 హెచ్పీలలోపు ఉన్న మరమగ్గాలు, కండెల మిషన్లు, వార్పిన్లకు ప్రయోజనం చేకూరనున్నది.
ఈ పరిశ్రమలో 10 హెచ్‌పీల నుంచి 25 హెచ్‌పీల వరకు మరమగ్గాలు నడిపించుకునే ఆసాములు ఎక్కువ శాతం ఉండగా, యజమానులు కొందరు ఉన్నారు. 25 హెచ్పీలు దాటితే విద్యుత్ రాయితీలు వర్తించవు. ప్రస్తుతం 10 హెచ్పీలకు యూనిట్ విద్యుత్‌కు 8.80 వసూలు చేస్తుండగా, అందులో 4.80లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. మిగతా 4లు ఆసాములు, యజమానులు చెల్లిస్తున్నారు. పెంచిన లిమిట్ ప్రకారం 25 హెచ్‌పీల వరకు వర్తించనున్నది. ఈ వెసులుబాటుతో మరమగ్గాల ఆసాములు, యజమానులకు భారీ ఊరట లభించింది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తమిళనాడులోని తిరుపూరుకు దీటుగా అభివృద్ధి చెందాలన్నది కేటీఆర్ సంకల్పం. అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన చేనేత జౌళీశాఖ మంత్రిగా పనిచేశారు. వస్త్ర పరిశ్రమను అవపోసన పట్టిన ఆయన, మరమగ్గాలను ఆధునీకరించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సాంచాలను ఆధునీకరించడంతోపాటు రేపియర్, వాటర్ జెట్, ఎయిర్‌జెట్ లాంటి సాంచాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచించారు. అందుకు తిరుపూరు, సూరత్, ఇచ్చల్ కరంజీ, నాగ్‌పూర్‌కు స్టడీటూర్ కోసం పంపించారు. నేతన్నలకు చేతినిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన మంత్రిగా బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, విద్యార్థుల యూనిఫాంలు, కేసీఆర్ కిట్లు, వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇప్పించారు.
చేతినిండా పని, పనికి తగ్గ వేతనం పొందిన నేతన్నలు సంతోషంతో ఉండేలా చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయించారు. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వక పోవడంతో మళ్లీ వస్త్ర పరిశ్రమ సంక్షోభం వైపు మళ్లింది. పరిశ్రమ సంక్షోభాన్ని, నేతన్నల దయనీయ పరిస్థితులను అర్థం చేయించేలా ఈ నెల 25న జరిగిన ఈఆర్సీ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. 5 హెచ్‌పీల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, 10 హెచ్‌పీల లిమిట్ విద్యుత్ రాయితీలను 30 హెచ్పీలకు పెంచాలని డిమాండ్ చేశారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి వస్త్ర పరిశ్రమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో ఆయన డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం అంగీకరించింది.
వస్త్ర పరిశ్రమకు విద్యుత్ రాయితీని 25 హెచ్పీలకు పెంచడం హర్షించదగ్గ విషయం. సిరిసిల్లలో దాదాపు 30 వేల మరమగ్గాలున్నాయి. విద్యుత్ రాయితీల కోసం ఎదురుచూస్తున్న ఆసాములు, యజమానులకు ఎంతో ఊరట నిచ్చింది. ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కోసం విద్యుత్ సమస్యను పరిష్కారం చేసినందుకు ఈఆర్సీకి కృతజ్ఞతలు.
– చిక్కాల రామారావు, సెస్ చైర్మన్