Koppula Eswar | ధర్మారం మే17: రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు అర్థరహితమని బీఆర్ఎస్ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి శ్రీధర్ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఈశ్వర్ పై లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రి ఈశ్వర్ ఆరు సార్లు ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. పలుమార్లు ఓటమిపాలైన లక్ష్మణ్ కుమార్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో జనాన్ని మభ్యపెట్టి ఏడుస్తూ సానుభూతి తో ఎమ్మెల్యేగా గెలిచాడని శ్రీధర్ ఎద్దేవా చేశారు. నాలుగు సార్లు ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ ఆయనను విమర్శించడం ఎంతో విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా ఈశ్వర్ పనిచేసిన హయాంలో పీఏలపై లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేయటం కాదని ఆయన అన్నారు.
ఈశ్వర్ ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ శాఖలకు మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆయనకు పిఏలు అదే స్థాయిలో ఉంటారనే విషయాన్ని లక్ష్మణ్ కుమార్ కు అవగాహన లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈశ్వర్, పిఏలు కమిషన్లు తీసుకున్నారని చేసిన ఆరోపణలు లక్ష్మణ్ నిరూపించగలారా..? అని శ్రీధర్ ప్రశ్నించారు. పిఏలపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు తగదని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి ఈశ్వర్ పై విమర్శలు పక్కనపెట్టి ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని శ్రీధర్ హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చానని, జీవోలు వచ్చాయని ప్రకటించడం మినహా ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను లక్ష్మణ్ కుమార్ ఎందుకు పూర్తి చేయించడం లేదని శ్రీధర్ ప్రశ్నించారు.
ధర్మపురిలో మాతా శిశు దవాఖాన, నంది మేడారం లో 30 పడకల దవాఖానను ప్రారంభించడానికి ఎందుకు చొరవ చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. గొల్లపల్లి మండలానికి ఈశ్వర్ మంత్రిగా పనిచేసిన సమయంలో గురుకుల పాఠశాల శాశ్వత భవనం నిర్మాణానికి రూ.17 కోట్లు నిధులు మంజూరు చేయించగా తానే నిధులు మంజూరు చేయించానని, ప్రజలను పక్కదారి పట్టించి ఇటీవల మళ్లీ అక్కడే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెల్గటూర్ మండలం లో శాఖపూర్ గ్రామంలో నీటి ఎద్దడి ఉందని గ్రామస్తులు ప్రశ్నిస్తే వారిపై పోలీస్ కేసుల బనాయింపు జరగడం ఏమిటని అన్నారు. 2018 జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి జగిత్యాల కలెక్టర్ శరత్ పుణ్యమా అని ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచాడని లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఈశ్వర్ ఎమ్మెల్యే విజయం సరైందేనని హైకోర్టు తీర్పును తీర్పును ఇవ్వగా లక్ష్మణ్ కుమార్ దీనిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ అగ్రికల్చరల్ కాలేజీని వెల్గటూర్ మండలం స్తంభంపెల్లికి తీసుకువచ్చినట్టు ఈశ్వర్ జీవో తీసుకు రాలేదనే సవాల్ పై లక్ష్మణ్ కుమార్ నిలబడాలని ఆయన పేర్కొన్నారు.
అగ్రికల్చరల్ కళాశాల రాకపోతే ప్రభుత్వం అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేసిందో లక్ష్మణ్ కుమార్ ప్రజలకు చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సంవత్సరం లోకి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు, డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఏర్పాటు బస్సు డిపో ఏర్పాటు లక్ష్మణ్ కుమార్ ఎందుకు ఏర్పాటు చేయించలేదని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు చెగ్యాం ముంపు బాధితులకు రూ.18 కోట్ల పరిహారం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించగా దానిని తానే మంజూరు చేయించానని లక్ష్మణ్ కుమార్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు సముచిత స్థానం కల్పిస్తుందని అంటున్న లక్ష్మణ్ కుమార్ కాళేశ్వరం లో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రొటోకాల్ పాటించకుండా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించిన దానిపై సమాధానం చెప్పాలని అన్నారు. ఇకనైనా ఈశ్వర్ పై లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేయడం మానుకొని హుందాగా వ్యవహరించారని శ్రీధర్ హితవు పలికారు.
ఈ విలేకరుల సమావేశంలో మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, సర్పంచుల ఫోరం మాజీ మండల మాజీ అధ్యక్షుడు పూస్కురు జితేందర్ రావు, ఏఎంసి మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి , మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు మిట్ట తిరుపతి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, పార్టీ అనుబంధ శాఖ మండల అధ్యక్షులు దేవి నలినీకాంత్ దేవి వంశీకృష్ణ , పార్టీ నాయకులు ఏగ్గేల స్వామి, కోమటిరెడ్డి మల్లారెడ్డి, ఐత వెంకటస్వామి, కాంపల్లి చంద్రశేఖర్, ఆవుల లత, రెడపాక శ్రీనివాస్, గంధం నారాయణ, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణుగోపాల్, దీటి శ్రీనివాస్, గంధం తిరుపతి, సాయిరి కుమార్, రాగుల చిన్న మల్లేశం, పాలమాకుల తిరుపతిరెడ్డి, బొలిశెట్టి సుధాకర్, దేవి రాజారాం, నేరెళ్ల చిన్న లచ్చయ్య, పుట్ట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.