యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా, అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం అలసత్వం చూపుతున్నది. ప్రభుత్వం కూడా అదే ధోరణితో ముందుకెళ్తుండడం రైతుకు శాపంలా మారుతున్నది. ఈ సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 1,183 ప్రారంభించామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది.
క్షేత్రస్థాయిలో 80 శాతానికిపైగా సెంటర్లు ఓపెన్ కాలేదని తెలుస్తుండగా.. ఇదే అదనుగా వ్యాపారులు రంగంలో దిగారు. క్వింటాల్‌కు 1800లే చెల్లిస్తుండగా, తప్పని పరిస్థితుల్లో కర్షకులు అగ్గువకే అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వింటాకు 400 దాకా నష్టం జరుగుతుండగా, సర్కారు చోద్యం వల్లే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారుల మాటలన్నీ నీటిమూటలేనని, లెక్కలన్నీ పేపర్లమీదే ఉన్నాయని మండిపడుతున్నారు. మరో వారంలో కోతలన్నీ దాదాపు చివరి దశకు చేరుకొని ధాన్యం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోతే భారీ నష్టం వాటిల్లే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సీజన్లో జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మొత్తం 1,331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 8 నాటికే 1,183 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. జిల్లాల వారీగా చూస్తే జగిత్యాలలో 418 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పటికే 410 ప్రారంభించినట్లు చెబుతున్నారు.
అలాగే కరీంనగర్లో 341కి గాను 250, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 259కి గాను 250, పెద్దపల్లి జిల్లాలో 313కు గాను 283 ఓపెన్ చేశామంటున్నారు. అయితే యాసంగి వరి కోతలు పదిహేను రోజుల నుంచే మొదలయ్యాయి. రోజురోజుకూ జోరుగా సాగుతున్నాయి. కోసిన ధాన్యాన్ని రెండు మూడు రోజులు ఎండబెట్టి విక్రయించేందుకు రైతులు చూస్తుంటే.. ఎక్కడా సెంటర్లే కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు.
అధికారులు చెబుతున్నట్లుగా ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏ జిల్లాలోనూ ప్రారంభం కాలేదు. క్షేత్రస్థాయిలో చూస్తే ప్రతి మండలంలోనూ ఒకటి రెండు కేంద్రాలు తప్ప, మిగిలిన వాటి జాడ కనిపించడం లేదు. ఈ నెల 8 నాటికి 1,183 కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటించినా.. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కేవలం 327 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అంటే మిగతావన్నీ పేపర్‌పైనే ఓపెన్ చేసినట్లుగా లెక్కలు కనిపిస్తున్నాయి.
ఎప్పటి మాదిరిగానే ప్యాక్స్, ఐకేపీ, మెప్మా, డీసీఎంస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన అధికారయంత్రాగం, సదరు సంస్థలతో సమావేశాలు కూడా నిర్వహించింది. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే విషయంపై అధికారులు దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి. నిజానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, కొనుగోళ్లపై ఏ రోజుకారోజు సమీక్షలు చేస్తే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితుల్లేవు.
ప్రస్తుతం ధాన్యం ఫైన్ రకం క్వింటాల్‌కు 2,203, సాధారణ రకానికి 2,183 మద్దతు ధర ఉంది. ఇంకా తాము అధికారంలోకి వస్తే ధాన్యం క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు కూడా చేసింది. ఆ లెక్కన చూస్తే మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. అయితే బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతుండగా, ఈ సీజన్లో ఇవ్వరని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో పదిహేను రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభం కాగా, ఇప్పటికే పలు గ్రామాల్లో 20 నుంచి 25 శాతం వరకు పూర్తయ్యాయి.
అయితే ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తరలిద్దామంటే మెజార్టీ ప్రాంతాల్లో సెంటర్లు ప్రారంభంకాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు వస్తుండడం, మరోవైపు మళ్లీ వర్షాలు రావొచ్చని వాతావారణ శాఖ సూచన చేయడంతో ఆగమవుతున్నారు. ఎండబెట్టిన ధాన్యం ఎక్కడ తడిసిపోతుందో అన్న భ యంతో అగ్గువకే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, రైస్‌మిల్లర్లు క్వింటాల్‌కు 1800 చెల్లిస్తుండగా, ఈ లెక్కన ఒక్కో క్వింటాల్‌పై సుమారు 400 దాకా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
నాలుగు జిల్లాల్లోనూ వరి కోతలు ఉధృతమయ్యాయి. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొంత మంది రైతులు నాలుగైదు రోజులు ముందుగానే కోతలు కానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం దిగుబడులు ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు వెల్లువెత్తే అవకాశమున్నది. ఈ క్రమంలో అధికారయంత్రాంగం అప్రమత్తం కావాల్సి ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన లక్ష్యం మేరకు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరమున్నది.
అంతేకాదు, వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లుగా నిబంధనలకు లోబడి కొనుగోలు చేసేందుకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చుకునే విషయంపై దృష్టిపెట్టాలి. ప్రతి రోజూ కొనుగోలు కేంద్రం వారీగా సమీక్షిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావన్న అభిప్రాయాలున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా అన్నదాతలు భారీగా నష్టపోయే ప్రమాదమున్నది. అలాగే రైతు అవసరాలను ఆసరాగా చేసుకొని మద్దతు ధరకన్నా తక్కువ రేటుతో కొనుగోలుచేసే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరమున్నది. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది.