పెద్దపల్లి : ప్రభుత్వ ఉద్యోగులుగా మూడు దశాబ్దాలకు సేవలందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో( Retired employees) ప్రభుత్వం ఆటలాడుకుంటుందని రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం (రెవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొహెడ చంద్రమౌళి ( Chandramouli ) ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా రామా అంటూ, తీర్థ యాత్రలు తిరుగుతూ, మనుమలు మనుమరాళ్లతో ఆనందంగా గడిపే వయస్సులో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దయనీయ పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందని పేర్కొన్నారు.
శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బందులపాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యనాకి నిరసనగా ఈనెల 7న ఉమ్మడి పది జిల్లాల కలెక్టరేట్ల ఎదుటు ధర్నా చేయనున్నామని వెల్లడించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదవీ విరమణ చేసిన నాడే ఉద్యోగ ప్రయోజనాలు ఉద్యోగి ఖాతాలో జమచేయాలని చట్టాలు చెబుతున్నా ప్రస్తుత పాలకులు మాత్రం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని మండి పడ్డారు. ప్రజాపాలనలో 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏడాదిన్నరగా రిటైర్మెంట్ బెనిఫిట్లు అందకపోవటం సిగ్గు చేటన్నారు. గ్రాట్యూటి, కమ్యూటేషన్, జీపీఎఫ్, జీఐఎస్, నగదు సెలవులు వంటి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
గ్రాట్యూటీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షలు ఇస్తుండగా, రాష్ర ప్రభుత్వం మాత్రం రూ.16 లక్షలు చెల్లించి చేతులు దులుపుకుంటందని దుయ్యబట్టారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందుతాయో లేదో అనే బెంగతో పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి శుంకిశాల ప్రభాకరరావు, కోశాధికారి కనపర్తి దివాకర్, కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, కోడం వెంకట రాములు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.