కోరుట్ల/కోరుట్ల రూరల్, మే 6: కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపుతున్నదని, కనీసం పండించిన పంటలను కూడా కొనకుండా గోస పెడుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. వర్షం పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని, వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల కడుపు మండితే పరిస్థితులు చేయి దాటిపోతాయని హెచ్చరించారు. బుధవారం ఆయన కోరుట్ల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎదుట రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మక్కలు తెచ్చి ఇరువై రోజులవుతున్నా కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయమే వచ్చి ఎండలో పడిగాపులు పడుతున్నా పట్టించుకోవడం లేదని కంటతడి పెట్టారు. దీంతో ఎమ్మెల్యే చలించిపోయారు. రైతుల సమస్యలపై అధికారులను నిలదీశారు. కొనుగోళ్లల్లో జాప్యంపై ఆగ్రహించారు. రైతులను ఇబ్బందులకు పెట్టకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. మార్చిలో మక్క పంట చేతికి వస్తే ఇప్పటి వరకు కొనకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు.
మక్కలు ఎండకు ఎండి నూకలాగ తయారవుతున్నాయని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఓ పక్క మబ్బులు కమ్ముకుంటున్నాయని, ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలయిందని ఆవేదన చెందారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఏవో నాగమణి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు చీటి వెంకట్రావు, కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, ఫహీం, సురేందర్, విజయ్, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.