Gourd festival | జగిత్యాల టౌన్, జూలై 12: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జగిత్యాల అర్బన్, రూరల్ మండల విద్యాధికారులు చంద్రకళ, గాయత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారమని, కావున ఇది మహిళల సౌభాగ్యానికి ఆరోగ్యానికి సూచికగా నిలుస్తుందని అన్నారు.
ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందం ఆరోగ్యంతో పాటు శరీరంలోని వేడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందన్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీ సౌభాగ్యవంతురాలు అవుతుందని పురాణాల్లో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు అనిత, రాష్ట్ర కార్యదర్శి అనూజ, జిల్లా నాయకులు ప్రశాంతి శ్రీదేవి, పద్మ, సరోజ, అర్చన, సునీత, శ్రీలత, మోహిని, సువర్ణ, ప్రశాంతి, రేఖ తదితరులు పాల్గొన్నారు.