Gourd festival | కోల్ సిటీ, జూలై 12: గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఆషాఢమాసం పురస్కరించుకొని లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు శనివారం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా మైదాకు చెట్టుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సహజ సిద్ధమైన గోరింటాకులను అంతా కలిసి మెత్తగా నూరి గౌరీ దేవిని పూజించారు.
బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై మహిళలతో కలిసి గోరింటాకు పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు చిహ్నంగా గోరింటాకు పండుగను ప్రతీ ఏటా మహిళలు ఆషాఢ మాసంలో జరుపుకోవడం వెనుక శాస్త్రీయత ఉందన్నారు. గౌరీ దేవికి ప్రీతిపాత్రమైన గోరింటాకును మహిళలు ఈ నెలలో ఒక్కసారైనా పెట్టుకోవడం సనాతన ధర్మంలో భాగమన్నారు.
మన సంప్రదాయాలను మరిచిపోకుండా లక్ష్మీ గణపతి మిత్రమండలి సభ్యులు ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఈ వేడుకలు జరుపుకోవడం శుభ సూచికమన్నారు. అనంతరం మహిళలంతా కలిసి ఒకరినొకరు చేతులను గోరింటాకు మిశ్రమంతో అలంకరించుకొని మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వీణ, సత్య, వినోద, స్వాతి, శ్రీదేవి, పద్మ, రాధిక, ప్రభ, రాజ్యలక్ష్మీ, సంధ్య, శ్రీలత, రమ్య, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.