Sri Chaitanya | తిమ్మాపూర్, ఫిబ్రవరి13: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) 14వ కన్వొకేషన్ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ విభాగానికి చెందిన సముద్రాల శ్రీవిద్య, సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన నాదెం వేణు తమ తమ విభాగాల్లో విశిష్ట శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి యూనివర్సిటీ స్థాయిలో అగ్రస్థానం పొందారు. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు.
కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులను అభినందించి మాట్లాడారు. శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలు మరోసారి విద్యా ప్రాముఖ్యతను చాటుకుందని, విద్యార్థుల నిరంతర కృషి, పట్టుదల, సమయపాలన, అధ్యాపకుల సమర్థ మార్గదర్శకత్వం వల్లే ఈ విశిష్ట ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం తమ సంస్థకు గర్వకారణమన్నారు. ఇది విద్యార్థుల ప్రతిభకు, అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలను కొనసాగించాలని అన్నారు.
కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు అకాడెమిక్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందిని, ఇది ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. అధ్యాపకులు, సిబ్బంది, సహ విద్యార్థులు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని విశిష్ట విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.