GodavariKhani | కోల్ సిటీ, జనవరి 16 : ‘అమ్మా.. సమ్మక్క తల్లీ.. మా మొక్కును అలకించమ్మా.. నీ చెంతకు వస్తాం’ అమ్మా అంటూ వేడుకోగానే భక్తుల కోర్కెలు తీర్చే వన దేవతలకు భక్తులు తమ ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. గోదావరిఖని నగరంలో సమ్మక్క-సారలమ్మ జాతర సందడి అప్పుడే మొదలైంది.
ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో భాగంగా మొదటికి (మేడారం) కు తరలివెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అమ్మవార్ల అనుగ్రహం కోసం గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుగా సమర్పించడం, అంతకుముందు ముందు ఇంటి వద్ద సమ్మక్క, సారలమ్మలను కొలవడం ఆచారంగా వస్తోంది.
దీనిలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం)ను తులా భారం వేయించుకోవడం కనిపించింది. అనంతరం ఆ పల్లారంను వీధులలో ఇరుగు, పొరుగు వారికి పంచిపెట్టారు. నగరంలోని పలు కిరాణం దుకాణాలు సమ్మక్క భక్తులతో కిటకిటలాడాయి. దీనితో బెల్లం విక్రయాలు కూడా జోరుగా పెరిగాయి. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజలు చేసేందుకు తమ ఎత్తు బంగారంను కొనుగోలు చేస్తున్నారు.
తమ కుటుంబంను చల్లగా కాపాడాలని వేడుకుంటూ మొక్కులు చెల్లించేందుకు భక్తులు తల్లుల చెంతకు తరలివెళ్తున్నారు. అమ్మవార్లకు తమ ఎత్తు బంగారం సమర్పిస్తే చాలు.. ఏలాంటి కోరికలైనా నెరవేరుతాయన్న ప్రగాఢ విశ్వాసం ఉండటంతో బెల్లం విక్రయాలకు భారీగా డిమాండ్ పెరిగింది.