Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 31: ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 50వ జూనియర్, సీనియర్ జాతీయ స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్ షిప్-2025 పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరపున పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన పోస్టల్ ఏజెంట్ బాబర్ సతీమణి యోగా టీచర్ హసీనా ( 53) అనే గృహిణి పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచింది.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యోగా నిపుణులు పాల్గొన్న ఈ పోటీలలో హసీనా తృతీయ స్థానంలో గెలుపొందడం విశేషం. ఈమేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకులు డా. అగర్వాల్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా చాంపియన్ ట్రోఫీ, మెడల్ ను అందుకుంది. కాగా, హసీనా గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే యోగాలో శిక్షణ తీసుకొని తక్కువ కాలంలోనే భారత రికార్డును కైవసం చేసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.