పెద్దపల్లి, మార్చి 17 (నమస్తే తెలంగాణ): యావత్ రాష్ర్టానికే నీటి కుండగా పేరుగాంచిన గోదావరి తీరం నేడు కాంగ్రెస్ సర్కారు కుట్ర పూరిత రాజకీయాలతో ఎడారిగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీళ్లను సాధించుకునే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. ‘గోదావరి తల్లి కన్నీటి గోస’ మహాపాదయాత్రతో యావత్ తెలంగాణను కదిలిస్తుందని, కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో గోదావరి తల్లి కన్నీటి గోసను కండ్లగడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను వివరిస్తూ, కాంగ్రెస్ సరారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ 180 కిలో మీటర్ల మహా పాదయాత్ర చేపట్టారు.
ఈ నెల 22 వరకు సాగనున్న ఈ యాత్రను సోమవారం ఉదయం గోదావరిఖని గోదావరి తీరంలో కోరుకంటి చందర్, బొడ్డు రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపల్లి దివాకర్‌రావుతో కలిసి కొప్పుల ప్రారంభించారు. మొదటి రోజు 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాత్రి 9గంటల వరకు పెద్దపల్లికి చేరుకున్నారు. యాత్ర పొడవునా ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రారంభ కార్యక్రమంలో కొప్పుల మాట్లాడుతూ.. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ బీళ్లకు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ అయితే, కడుపు మంటతో కాళేశ్వరంపై నిందలు వేసి రైతుల కన్నీటికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కారణమైందని దుయ్యబట్టారు. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ చెప్పే కట్టు కథ కాదని, మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 200 కిలో మీటర్ల సొరంగాలు, 1530 కిలో మీటర్ల గ్రావిటీ కెనాళ్లు, 98కిలో మీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీలను 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం, 240 టీఎంసీల ఉపయోగంతో ప్రాజెక్టును గొప్పగా నిర్మించినట్లు వివరించారు.
ఒక్క మేడిగడ్డలో పిల్లర్ కుంగినంత మాత్రాన ప్రాజెక్టు పోదని, ప్రతి రైతన్న పంట పొలంలో కాళేశ్వరం ఉంటుందన్నారు. కేసీఆర్ గుర్తులను చెరిపేస్తానంటున్న రేవంత్‌రెడ్డి కాళేశ్వరంతో పండిన పంటల గుర్తులు, రైతులు గుండెల్లో ఉన్న స్థానాన్ని చెరిపేయలేరని చెప్పారు. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను యావత్ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, తగిన సమయంలో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారన్నారు. మహాపాదయాత్రతో రామగుండంలో అగ్గి రాజుకున్నదని, ఈ ఉద్య మం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందన్నారు.
ఇది చిన్న పోరాటమే కావచ్చు కానీ, దాని వెనుక న్యాయం ఉంటే రాష్ట్రమంతటా అంటుకుంటుందని, అదే మహోద్యమం అవుతుందన్నారు. కేసీఆర్ అండదండలతో నీళ్లు సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన కోరుకంటి చందర్, బొడ్డు రవీందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మూల విజయరెడ్డి, కౌశిక్ హరి, రఘువీర్‌సింగ్, నడిపెల్లి అభిషేక్‌రావు, ఉప్పు రాజ్ కుమార్, నారాయణదాస్ మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, జేవీ రాజుతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరువు కనబడటం లేదా?
కాళేశ్వరంపై కక్షగట్టి ఉన్న నీళ్లను కిందికి వదిలి లేని కరువును కాంగ్రెస్ తీసుకువచ్చింది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పొలాల్లో రైతులు పశువులను మేపుతున్నారు. కాంగ్రెస్‌కు రైతులపై ఎందుకీ కక్ష.. కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును అభాసుపాలు చేసేందుకు కుట్ర చేశారు. రైతులను నిలువునా ముంచుతున్నారు. 500 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కరువు ప్రభుత్వానికి కనబడడం లేదా?. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. కాళేశ్వరాన్ని రిపేర్ చేసి నీళ్లను నింపాలి.
-నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే (మంచిర్యాల)
రైతుల కన్నీళ్లు తుడిచేందుకే..
గోదావరి తీరాన్ని ఉద్యమ నేత కేసీఆర్ కాళేశ్వరంతో నిండుకుండను చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఎండిపోయింది. కేసీఆర్‌ను, కాళేశ్వరం ప్రాజెక్టును అభాసుపాలు చేయడానికే ఇలా చేశారు. ఈ కుట్ర వల్ల రైతులు నష్టపోతున్నారు. మా ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. కాళేశ్వరం లేక చెరువులు ఎండుతున్నాయి. కాలువల్లో నీళ్లు పారడం లేదు. రైతుల కండ్లలో కన్నీళ్లు పారుతున్నాయి. రైతుల ఆ కష్టాలను దూరం చేసేందుకే.. కన్నీళ్లను తుడిచేందుకే గోదావరిఖని నుంచి 180కిలో మీటర్ల మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టాం.
-బొడ్డు రవీందర్, మహాపాదయాత్ర కో-కన్వీనర్ (గోదావరిఖని)
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
కేసీఆర్‌ను అభాసుపాలు చేయాలనే దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చింది. నీళ్ల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు మళ్లీ వచ్చాయి. రేవంత్‌రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాల పురిటి గడ్డ రామగుండం నుంచే మరో ఉద్యమం ప్రారంభమైంది. ఎండిన గోదావరిని నింపుకొనేందుకే ఈ ఉద్యమం. ప్రతి గ్రామం నీళ్ల కోసం పరితపిస్తున్నది. పదేళ్లపాటు సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో నడిపితే రేవంత్‌రెడ్డి రైతులను గోస పెడుతున్నారు. దొంగ ప్రచారాలు, మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా గోదావరిని ఎండబెట్టి నీళ్లను సముద్రంలోకి వదిలారు. గోదావరిఖనిలోనే పదిరోజులకు ఒక సారి తాగు నీళ్లు వస్తున్నాయి. ఇంకా కష్టాలు పెరుగుతాయి. కాంగ్రెస్, సీఎంకు బుద్ధి చెప్పేందుకే మహా పాదయాత్ర చేపట్టాం.
– కోరుకంటి చందర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు (పెద్దపల్లి)
బీఆర్ఎస్ నింపితే..కాంగ్రెస్ ఎండబెట్టింది
ఎడారిగా ఉన్న గోదావరిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి నిండు కుండలా చేస్తే.. కాంగ్రెస్ సర్కారు ఎండబెట్టింది. కాంగ్రెస్ అంటేనే కన్నీళ్లు.. ప్రజా వంచన అని మరోసారి నిరూపించారు. అందుకు ఈ గోదావరే సజీవ సాక్ష్యం. సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ప్రాంతంపై ప్రేమ ఉండకపోవచ్చు. కానీ, ఇదే గోదావరి తీరం వెంట ప్రస్తుతం ఉన్న మంథని, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేలు చవటలు, దద్దమ్మలుగా మిగిలిపోయారు అనేందుకు ఎండిన గోదావరే నిదర్శనం. శివరాత్రి రోజు పుణ్య స్నానం చేయడానికి కూడా నీళ్లు ఉంచని వీళ్లను గెలిపించినందుకు ప్రజలు బాధ పడుతున్నారు. గోదావరిని ఎండబెట్టడంతో మత్స్యకారులు, రైతులు తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై కేసులపై పెడుతున్న శ్రద్ధ గోదావరిలో నీళ్లపై పెడితే ఈ ప్రాంతానికి మేలవుతుంది. ఈ మహాపాదయాత్రతోనైనా వారికి బుద్ధి వస్తుంది.
-పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే (మంథని)