Collector Pamela Satpathy | మహిళలు ఉన్నత చదువులు చదివి, ఆర్థిక ప్రగతి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఇవాళ కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని.. బాలురతో సమానంగా బాలికలను పెంచి ఉన్నత చదువులు చెప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తాయని.. ఎంత కష్టమైనా ఉన్నత చదువులు చదవాలని బాలికలకు సూచించారు. మహిళలు ఏ రంగంలో ఉన్నా బాధ్యతలు మర్చిపోవద్దని.. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఇంటి పనులు, ఉద్యోగ విధులతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఉన్నత చదువులు, ఆర్థిక స్వేచ్ఛ మహిళల సొంతమైతే సాధికారత సాధ్యమవుతుందన్నారు.
సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్ ధనలక్మి మాట్లాడుతూ.. పిల్లలకు ఎలాంటి ప్రవర్తన నేర్పుతున్నామన్నది తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందన్నారు. మంచి, చెడు చెప్పి విచక్షణ కల్గిన పిల్లలుగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శోభారాణి మాట్లాడుతూ.. ఎవరు వస్తారని ఎదురు చూడకుండా మనకు మనం ఎదగాలన్నారు. బాలికల హక్కులు, మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చట్టాలను వివరించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కలెక్టర్‌ను వివిధ శాఖల ఉన్నతాధికారులు సన్మానించారు. శ్రీనిధి రుణాల్లో పనితీరు కనబరిచినందుకు జమ్మికుంట, హుజురాబాద్ పట్టణ సమాఖ్య అధ్యక్షురాళ్లకు సర్టిఫికెట్, మెమోంటో అందించారు. ఈ సందర్భంగా బాలభవన్ చిన్నారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు, యోగ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులను కలెక్టర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి,జిల్లా అదనపు వైద్యాధికారి సుజాత, మెప్మా పిడి వేణుమాధవ్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి, సీడీపీఓలు అధికారులు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్