తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పదో తరగతి విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న సమయంలో వారిని వెనుక నుంచి ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అమ్మాయిల ఫోటోలు కూడా తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల, ఓ ఉపాధ్యాయురాలు బోధన పూర్తయ్యాక విద్యార్థులను ప్రశ్నలు అడిగేందుకు వారి బెంచ్ దగ్గర కూర్చున్నప్పుడు.. కొంతమంది విద్యార్థులు గోప్యంగా మొబైల్ ద్వారా ఆమె ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా పాఠశాలలో ఈ వ్యవహారం కొనసాగుతునప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ విద్యార్థి మొబైల్‌ను పదో తరగతి విద్యార్థిని తన తండ్రికి కాల్ చేయడానికి తీసుకోగా, అందులో ఈ ఫొటోలు బయటపడ్డాయి. దీనిపై విద్యార్థినులు స్పందించి ఉపాధ్యాయురాలికి తెలియజేయగా, ఆమె వెంటనే ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, విషయం బయటికి రాకుండా చూసినట్లు సమాచారం.
ఇలా విద్యార్థులు పాఠశాలు మొబైల్ ఫోన్లు తీసుకురావడం, వాటిని దుర్వినియోగం చేయడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై తొర్రూరు ఎస్సై ఉపేందర్ ను వివరణ కోరగా తమకు ఎలాంటి రాలేదని, తాను కేవలం మోటివేషన్ క్లాసులు నిర్వహించేందుకు పాఠశాలకు వెళ్లానని తెలిపారు. ఈ సంఘటన పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో క్రమశిక్షణ పెంపొందించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.