Mass cleanliness program | కోల్ సిటీ, అక్టోబర్ 23: గోదావరిఖని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాల బాలికలు స్వచ్ఛత బాట పట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టారు. స్వచ్ఛ భారత్ లో భాగస్వామ్యంగా గురువారం పీజీ, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థినులు క్షేత్ర పాఠాలను అభ్యసించారు.
స్థానిక బస్టాండ్ ఏరియా పరిసరాల్లో రోడ్లపై పడేసిన చిత్తు కాగితాలను, వ్యర్థాలను తొలగించి స్థానికులకు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కల్పించారు. అక్కడ నుంచి కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు భారీ ర్యాలీగా నగర పాలక సంస్థ కార్యాలయంకు చేరుకున్నారు. జిల్లా వైద్యాధికారిణి వాణిశ్రీ, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటస్వామి, ఇతర అధికారుల సమక్షంలో విద్యార్థినులు సామూహిక ప్రతిజ్ఞ చేశారు.
ఆరోగ్య నగరం మనందరి బాధ్యత అని, వ్యక్తిగత పరిశుభ్రత మాదిరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామనీ, పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త డబ్బాలలో మాత్రమే వేయాలనీ, అలాగే ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అప్పగించాలని సూచించారు. అనంతరం విద్యార్థినులు రోడ్ల వెంట సేకరించిన చెత్తను నగర పాలక సంస్థ పారిశుధ్య సిబ్బందికి అప్పగించారు.
వీరిని డీఎంహెచ్ఓ, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, ఆర్టీసీ డీఎంలు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇనుగాల మనోహర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వై. ప్రసాద్, బాలికల కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ శంకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ సింగ్ ఓజా. ఎన్ఎస్ఎస్ అదికారులు కిరణ్మయి, సాంబశివుడు, నరేశ్, నగర పాలక ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా డీఎంసీ మౌనిక, అధిక సంఖ్యలో సిబ్బంది. వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.