KARIMNAGAR | కొత్తపల్లి (కరీంనగర్), మార్చి 29 : విశ్వసానికి మారుపేరైన శునకాన్ని ఆపద నుంచి కాపాడబోయిన అమాయక బాలిక తాను బలైపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని రేకుర్తి గ్రామ పరిధిలో గల సింహాద్రి కాలనీ లో మైరాల కృష్ణ దంపతులు నివాసముంటున్నారు. ముగ్గురు సంతానం కాగా, కూతురు మైరాల శ్రీనిధి (11) తమ పెంపుడు కుక్కను తీసుకుని శనివారం సమీపంలో గల పెంటకమ్మ చెరువు వద్ద ఆటకు తీసుకెళ్లింది.
చెరువులో నీటిలోకి దిగిన కుక్క మునుగుతుండటాన్ని చూసి, కాపాడేందుకు వెళ్లింది. నీటిలో నుంచి కుక్కను లాగే క్రమంలో బాలిక శ్రీనిధి కూడా నీటిలో మునిగింది. పక్కనే ఉన్న ఇద్దరు యువకులు అహ్మద్ ఖాన్, సాజిద్ లు గమనించి, చెరువులోకి దిగి కాపాడారు. అయితే అప్పటికే బాలిక నోటి ద్వారా నీటిని మింగటంతో అపస్మారక స్థాయికి చేరుకుంది.
చికిత్స నిమిత్తం వెంటనే కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి మరణించినట్లు తెలిపారు. అప్పటిదాకా తమతో ఉన్న బాలిక హఠాత్తుగా నీట్ మునిగి మరణించటంతో ఈ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. తోటి స్నేహితుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మైరాల శివ నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.