బోయినపల్లి రూరల్, మే 1 : ‘బిడ్డా పదో తరగతి ఫలితాలు వచ్చినయ్. నువ్వు చెప్పినట్టే మంచి మార్కులు తెచ్చుకున్నవ్. నువ్వే స్కూల్ ఫస్ట్ అచ్చినవట. మీ సార్లు చెప్పిన్రు. ఇప్పుడు నువ్వే లేకపోతివి కదా తల్లీ’ అంటూ పదో తగరతి విద్యార్థి నాగచైతన్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పదో తరగతి పరీక్షలు రాసి పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన ఆ బాలికకు బుధవారం వెల్లడైన ఫలితాల్లో మంచిమార్కులు రాగా, బిడ్డను తలుచుకుంటూ కంటతడి పెట్టారు.
బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, రజిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు నాగచైతన్య (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివేది. అయితే ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందింది. అయినా ఎప్పుడూ చలాకీగా కనిపించేది. మార్చిలో టెన్త్ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అయింది. పరీక్షలు కూడా రాసింది. పరీక్షలు బాగా రాశానని, తనకు మంచి మార్కులు వస్తాయని తల్లిదండ్రులతో సంతోషంగా చెప్పింది. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది.
ఆ బాలిక కొద్ది రోజులకే దవాఖానలో అడ్మిట్ అయింది. గత నెల 17న పరిస్థితి విషమించి చనిపోయింది. కుటుంబాన్ని కొండంత దుఃఖంలో ముంచి వెళ్లిపోయింది. కాగా, బుధవారం పదోతరగతి ఫలితాలు విడుదల కావడం, 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌ర్యాంకు పొందింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కూతురును తలుచుకొని విషాదంలో మునిగిపోయారు. బిడ్డ చదివే పాఠశాలకు వెళ్లి, కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురు చెప్పినట్టే మంచి మార్కులు సాధించిందని, కానీ, ఇప్పుడు తమ కూతురు లేదని విలపించారు. ఇటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు నాగచైతన్యను తలుచుకొని కంట తడి పెట్టారు.