చిగురుమామిడి, సెప్టెంబర్ 4: కరీంనగర్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షునిగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘ నాయకులు సమావేశమై శాసనమండలి డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ ఆదేశానుసారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన గీకురు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ముదిరాజు మత్స్యకారులను చైతన్య పరుస్తూ, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి, సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ స్థానిక సంస్థలలో ముదిరాజుల ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచుట కొరకు పని చేస్తానన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జిల్లా కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, సహకరించిన రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు, ఏయంసి ఛైర్మెన్ తిరుపతి, కొలకాని నర్సయ్యతో పాటు జిల్లా సంఘ నాయకులకు గీకురు రవీందర్ ధన్యవాదాలు తెలిపారు.