Gas cylinder price | జగిత్యాల, జూలై 2 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు ధనదాహానికి సకల జనం ఆగమవుతున్నది. అడ్డూ అదుపులేని ధరల పెంపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై పనుల భారం పడుతున్నది. ముఖ్యంగా ఐదేండ్ల క్రితం 500 ఉన్న సిలిండర్ ధర.. ఇప్పుడు ఏకంగా 1155కు చేరడం గుదిబండగా మారింది. మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. నాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కృషితో రూపాయి ఖర్చు లేకుండా సిలిండర్లు పొంది సంతోషంగా వంట చేసుకున్న నిర్వాహకులు, కేంద్రం బాదుడుతో సిలిండర్ కొనలేక మళ్లీ పొగచూరిన బతుకుల్లోకి వెళ్లిపోయారు. ఏడాది నుంచి కట్టెల పొయ్యి మీదే వంట చేస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు. పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం మాపై కొంచెం దయచూపి తక్కువ ధరకే సిలిండర్లు ఇవ్వాలని కోరుతున్నారు. – జగిత్యాల, జూలై 2 (నమస్తే తెలంగాణ)
మధ్యాహ్న భోజన కార్మికులకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయింది. కేంద్రం ఎడాపెడా సిలిండర్ ధరలు పెంచుతుండడంతో మళ్లీ పొగచూరిన బతుకుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నాడు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అనుక్షణం ఆరిపోయే పొయ్యిల కట్టెలను ఎగదోస్తూ దట్టంగా వెలువడే పొగతో కంటి జబ్బులతోపాటు శ్వాసకోశ వ్యాధులతో దాదాపు 14ఏండ్లపాటు నరకం చూ సిన కార్మికుల జీవితాల్లో స్వరాష్ట్రంలో మన సర్కారు వెలుగు నిండింది. ఐదేండ్ల క్రితం అప్పటి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో రూపాయి ఖర్చు లేకుండా సిలిండర్లు సమకూరగా, సంతోషంగా వంట చేసుకుంటూ వచ్చారు. అయితే మధ్యాహ్న భోజన కార్మికుల తలరాతలు మళ్లీ మారిపోయాయి. తిరిగి వారివి పొగచూరిన బతుకులే అయ్యాయి. కేం ద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బడిముబ్బడిగా సిలిండర్ల ధర పెంపుతో రీఫిల్లింగ్ చేయించుకోలేక మళ్లీ కట్టెల పొయ్యిలపైనే తమ బతుకులు వెల్లదీస్తున్నారు.
కష్టాల నుంచి మళ్లీ కష్టాల్లోకే..
దాదాపు 25ఏండ్ల క్రితమే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎనిమిదో తరగతి దాకా పిల్లలకు భోజనానికి అవసరమయ్యే నిధులను కేంద్రం 75 శాతం చెల్లిస్తుండగా, మిగిలిన 25 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నది. అయితే 9,10వ తరగతి చదివే పిల్లల భోజనానికి సంబంధించి కేంద్రం ఏ రాష్ర్టానికి బియ్యం కానీ, కూరగాయలు, పప్పుదినుసులకు సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే సన్నబియ్యంతో పోషకాహారాన్ని అందజేస్తూ వస్తోంది. మొదటి నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు కట్టెల పొయ్యిలనే వాడుతూ రాగా, అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎంతో మంది కార్మికులు కంటి జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల బారినపడ్డ సందర్భాలున్నాయి. ఇక వానకాలంలో అయితే భోజన తయారీదారుల కష్టాలు ఎక్కువగా ఉండేవి. తడిసిన కట్లెను వెలిగించి, మండేదాకా ఊదుతూ ఇబ్బందులు పడేవారు.
ఎంపీ ల్యాడ్స్ నుంచి సిలిండర్ల డిపాజిట్
జగిత్యాల జిల్లా అయిన తర్వాత 2018 జూన్లో జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీ క్షా సమావేశం జరిగింది. దిశా కమిటీ చైర్మన్గా ఉన్న అప్పటి నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎమ్మె ల్సీ కవిత, మధ్యాహ్న భోజనంపై సమీక్షిస్తున్న టైంలో కార్మికులు కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న విషయం చర్చకు వచ్చింది. దీంతో స్పందించిన ఎంపీ కవిత ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సిలిండర్ కనెక్షన్ ఎందుకు ఇవ్వలేమని అప్పటి కలెక్టర్ డాక్టర్ శరత్ను ప్రశ్నించగా, సిలిండర్, రెగ్యులేటర్ డిపాజిట్లను మధ్యాహ్న భోజన కార్మికులు చెల్లించాల్సి ఉంటుందని, ఇది వారికి ఇబ్బందిగా మా రిందని చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన కవి త, తన ఎంపీ ల్యాడ్స్ నుంచి సిలిండర్లకు డిపాజిట్ చెల్లిస్తానని ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఉన్న 753 పాఠశాలలకు సిలిండర్, రెగ్యులేటర్ డిపాజిట్లకు సంబంధించి 1600 చొప్పున 12లక్షల నిధుల దాకా చెల్లించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభు త్వ పాఠశాలలకు సిలిండర్ కనెక్షన్ సమకూరింది. మధ్యాహ్న భోజన కార్మికుల బాధలకు చెల్లుచీటి పడింది. ఈ క్రమంలో సిలిండర్లపై సంతోషంగా వంట చేస్తూ పిల్లలకు వడ్డిస్తూ వచ్చారు.
కండ్లు మండుతూనే ఉన్నయి
నేను చాలా ఏండ్ల సంది మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న. ఎప్పుడు కట్టమే. వాన చినుకు వచ్చిందంటే చాలు తడిసిన కట్టెలతోటి పొయ్యి ముట్టిచ్చుడు గగనమైతుండె. ఊది ఊది కండ్లు పోయేది. పొగ పెయ్యిలకు పోయేది. వశపడని దగ్గుతో మస్తు కష్టమయ్యేది. ఐదేండ్ల కింద కవిత మేడం సిలిండర్లు ఇచ్చిండ్రు. మేము ఒక్కరూపాయి కట్టకుండానే సిలిండర్ వచ్చింది. కొన్నేండ్లు మంచిగానే అనిపిచ్చింది. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. సిలిండర్ ధర ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్నరు. మాతోటి ఏమైతది. అందరం సిలిండర్లు బంద్ పెట్టి, మళ్ల కట్టెల పొయ్యిలపై అండుతున్నం. మళ్లీ మా కండ్లు మండుతూనే ఉన్నయి. కట్టపడుతూనే ఉన్నం.
– అమ్మాయి, వంట తయారీదారు (ధరూర్ పాఠశాల)
మళ్లీ పొగచూరిన బతుకులే..
జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సిలిండర్ కనెక్షన్లు ఉన్నప్పటికీ మళ్లీ కట్టెల పొయ్యిపైనే కార్మికులు వంట చేసే దుస్థితి నెలకొంది. 2018లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన టైంలో సిలిండర్ రీఫిల్లింగ్ ధర కేవలం 500గా ఉండడంతో కార్మికులకు పెద్దగా సమస్య కాలేదు. కట్టెల కంటే సిలిండర్ ధర చౌకగా లభించడంతో వారు సంతోషించారు. జిల్లాలో చాలా పాఠశాలల్లో నెలకు రెండు సిలిండర్ల వినియోగం జరుగుతుండగా, కొన్ని పాఠశాలల్లో అయితే నెలకు మూడు దాకా పడుతున్నాయి. అయితే ఈ ఐదేండ్ల వ్యవధిలో సిలిండర్ రీఫిల్లింగ్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచివేయడం మధ్యాహ్న భోజన కార్మికుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం సిలిండర్ ధర 1155 ఉండడంతో రీఫిల్లింగ్ చేయించలేని పరిస్థితి నెలకొన్నది. నెలకు సిలిండర్ల కోసమే 2310 చెల్లించాల్సి రావడం, రీఫిల్లింగ్తో పాటు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు చెల్లించడం భారంగా మారిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లోనూ కార్మికులు సిలిండర్లను పక్కన పారేసి మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయించారు. మధ్యాహ్న భోజన తయారీ సమయానికి వెళితే పాఠశాలలకు కార్మికులు తమ బాధను వెల్లబోసుకుంటున్నారు. సిలిండర్ రీఫిల్లింగ్ ధర పెంచడంతో తమ జీవితాలకు మళ్లీ పొగచూరిందని వాపోతున్నారు.
కట్టెల పొయ్యిపై వంటచేస్తున్నాం
మధ్యాహ్న భోజనం తయారు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడం లేదంటే సిలిండర్ల ధర మమల్ని మరింత ముంచింది. కవిత మేడం ఎంపీగా ఉన్నప్పడు మాకు ఉత్తిగానే సిలిండర్లు ఇచ్చారు. కొన్నాళ్లు వాటిపైనే వంట చేశాం. ఏ బాధా లేకుంట పోయింది. వర్షం పడినా పెద్దగా కష్టం కాలేదు. కొంచెం ప్రాణం నిమ్మలమైందని అనుకునే సరికి సిలిండర్ ధరలు పెరిగినయి. 500 ఉన్న బండ ధర పన్నెండు వందలైంది. వంటకు రెండు, మూడు సిలిండర్లు అంటే మొత్తం దానికే అయిపోతున్నయి. దిక్కులేని పరిస్థితిలో మళ్లీ కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులపై కొంచెం దయచూపాలే. తక్కువ ధరకు సిలిండర్లు ఇయ్యాలే.
– ముత్తునూరి మధులత, మధ్యాహ్న భోజన కార్మికురాలు, లక్ష్మీదేవిపల్లి (సారంగాపూర్ మండలం)