అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం కుటుంబ పరివారం జనంలోకి వెళ్తున్నది. ఉమ్మడి గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు సమాయాత్తమైంది. ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది. ఇప్పటికే అభ్యర్థులు హోరెత్తిస్తుండగా, వారికి మద్దతుగా సతీమణులు, తనయులు, కోడళ్లు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో తలోదిక్కున వెళ్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ‘గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో’ అంటూ గడపగడపనూ తడున్నారు. మహిళలకు బొట్టుపెడుతూ, వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే వివరిస్తూ గెలుపువైపు సమరోత్సాహంతో దూసుకెళ్తున్నారు.
– కరీంనగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్ అసెంబ్లీకి పోటీలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ తరఫున ఆయన సతీమణి గంగుల రజిత ప్రతీ ఎన్నికలో అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలను కలుపుకుని ఆమె నిర్వహించే ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ పథకాల గురించి సామాన్యులకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు. ఈసారి రజిత తన భర్త గంగుల కంటే ముందుగానే ప్రజల్లోకి వెళ్లారు. సద్దుల బతుకమ్మకు ముందు నగరంలోని వివిధ డివిజన్లలో ప్రచారానికి వెళ్లి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రజలతో కలివిడిగా ఉంటూ వారితో కలిసి పోతున్నారు. ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్న గంగుల రజిత నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు.
కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్, నాగులమల్యాల, మల్కాపూర్‌తో పాటు కొత్తపల్లి పట్టణంలోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారంలో ప్రధానంగా గంగుల కమలాకర్ చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా అందుతున్న లబ్ధిని, ప్రస్తుత మ్యానిఫెస్టోను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. మంత్రి గంగుల సోదరుని కొడుకు గంగుల ప్రదీప్ కూడా తన బాబాయ్ కోసం ప్రచారం చేస్తున్నారు. గంగుల కమలాకర్ (జీకే) యూత్ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రదీప్.. తన స్నేహితులు, జీకే యూత్ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి పట్టణంలోనే కాకుండా ఇదే మండలంలోని మల్కాపూర్, కరీంనగర్ మండలం నగునూర్‌లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21న అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించారు. ఆ వెంటే క్యాండిడేట్లు రంగంలోకి దిగారు. దాదాపు రెండు నెలలుగా ప్రజాక్షేత్రంలో కలియదిరుగుతున్నారు. నిత్యం జనంతో మమేకమవుతూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను ఆశీర్వదిస్తే రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. వీరికి తోడుగా కుటుంబసభ్యులు కూడా ఎన్నికల క్షేత్రంలోకి దిగారు. సతీమణులు, కొడుకులు, బిడ్డలు, కోడళ్లు ముమ్మర ప్రచారానికి నడుం బిగించారు.
నియోజకవర్గాల్లో నలువైపులా కలియదిరుగుతున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అంతటా హోరెత్తిస్తున్నారు. సర్కారు పథకాల లబ్ధిదారులను కలుస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన పనులు, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. మ్యానిఫెస్టోను చూపుతూ చేపట్టబోయే అభివృద్ధి పనులు, కొత్త స్కీంల గురించి విడమరిచి చెబుతున్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని, ప్రజల జీవితాల్లో మార్పులను గమనించాలని కోరుతున్నారు. మళ్లీ కారు గుర్తుకు ఓటేసి ఆదరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తన కూతురు శ్రీనికారెడ్డితో కలిసి ప్రచారం చేయడాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభినప్పుడు ఆమెను తనతో కలిసి ప్రజల్లో తిప్పారు. ఇప్పటికీ ముఖ్యమైన సమావేశాలు ఉంటే తన కూతురుతో కలిసి కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా సమావేశాల్లో ఆమెతో మాట్లాడిస్తున్నారు. చిన్నారి శ్రీనికా తన తండ్రి చేయాలనుకునే పనులను ప్రజలకు వివరిస్తున్నపుడు జనం ఆసక్తిగా వింటున్నారు. ఆమె చెప్పే ముద్దు ముద్దు మాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కేసీఆర్ రాష్ర్టాన్ని ఎలాగైతే అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారో తన తండ్రి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిస్తే అదే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని రెండింటినీ పోల్చుతూ శ్రీనిక చెప్పే మాటలు ఆశ్చర్య పరుస్తున్నాయి.
చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌కు మద్దతుగా ఆమె సతీమణి దీవెన ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గంగాధర మండలంలోని బూరుగుపల్లి, గంగాధర, ఇస్లాంపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజలను కలిసి నియోజకవర్గంలో తన భర్త చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్ కొడుకు ఇంద్రనీల్ బాబు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. తండ్రి ఒక వైపు, కొడుకు ఒక వైపు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇంద్రనీల్ ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని వారిని ఉత్తేజ పర్చడం, కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించి బైక్ ర్యాలీలు నిర్వహించడం, ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేయడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సైదాపూర్ మండలం ఆరెపల్లి, జాగిరిపల్లెలో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో కార్యకర్తలను సమన్వయ పర్చిన తీరు అద్భుతంగా ఉంది. సమస్యలు తెలుసుకుని తన తండ్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని దాదాపుగా పరిష్కరించి, కార్యకర్తల మన్ననలు పొందుతున్నారు.