కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ అధ్వర్యంలో కరీంనగర్ నియోజక వర్గంలోని ప్రతి కల్లం తిరిగి రైతులకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. తాగు, సాగునీటికోసం పోరాడుతామని, ‘చలో నారాయణపూర్ రిజర్వాయర్’ పేరుతో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని దుర్శేడ్, మొగ్దుంపూర్, చెర్లభూత్కూర్, జూబ్లినగర్, నగునూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి రైతులను పట్టించుకోవాలని సూచించారు. ధాన్యాన్ని కేంద్రాలకు దగ్గరగా ఉన్న మిల్లులకు కేటాయించకుండా దూర ప్రాంతాలకు కేటాయించడం వల్ల రవాణా భారం పెరుగుతుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వివరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉన్నాయా? లేవా? అని తెలుసుకున్నారు. తేమ 12 శాతం వచ్చిన వెంటనే కొనకుంటే నూకగా మారే పరిస్థితి ఉందన్నారు.
వడగండ్ల వానలు వచ్చే ప్రమాదం ఉన్నందున ధాన్యం వెనువెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సమయంలోగా 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని, ఇప్పుడు 30 లక్షల టన్నులకు పడిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కరీంగనర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, దుర్శేడ్ ప్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, వైస్ చైర్మన్ గోనె నర్సయ్య, మాజీ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, జక్కం నర్సయ్య, ఉప్సుల శ్రీధర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి, చల్ల లింగారెడ్డి, నెక్ పాషా, వరి భద్రయ్య, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.