కొత్తపల్లి, సెప్టెంబర్ 4 : గణేశ్ నిమజ్జనోత్సవానికి కరీంనగర్లో ఏర్పాట్లు చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను వస్తే ఒక అధికారి కూడా నిమజ్జన కేంద్రం వద్ద ఉండరా..? అంటూ మండిపడ్డారు. చింతకుంటలోని వినాయక నిమజ్జన కేంద్రమైన ఎస్సారెస్పీ కెనాల్‌ను గురువారం ఆయన పరిశీలించారు. శుక్రవారం ఉదయం నుంచే నిమజ్జనం ప్రారంభం కానుండగా ఇప్పటివరకు ఒక క్రేన్ లేదని, లైట్లు లేవని, ఒక అధికారి లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాట్లపై వారం రోజుల నుంచే రివ్యూ సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాట్లు లేవని, వినాయకులు వచ్చే రూట్ మ్యాప్ లేదని, ఒక అధికారి కూడా నిమజ్జన కేంద్రాల వద్ద లేరని.. ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు.
అధికారులు మొద్దు నిద్ర వీడి.. వేలాది వినాయక ప్రతిమలు నిమజ్జనం చేసే మానకొండూర్, కొత్తపల్లి చెరువు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంటన బీఆర్ఎస్ నాయకులు పిల్లి మహేశ్‌గౌడ్, భూక్య తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, నరేందర్, కర్ర సూర్యశేఖర్ తదితరులు ఉన్నారు.