కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 26 : కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి ఆదివారం ఆచంపల్లి వరదకాలువ తూము వద్ద మహాధర్నా చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి నియోజకవర్గ రైతులతోపాటు ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, గంగాధర మండలంలో వరద కాలువపైన ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల, బావుపేట, కమాన్పూర్, కొండాపూర్, ఎలగందల్, శ్రీరాములపల్లె గ్రామాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. చెరువులు నింపాలని వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి ఇప్పటివరకు స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక పోరాటం తప్పదని భావించి నీటిని సాధించేందుకు రైతులతో కలిసి మహా ధర్నా చేపడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దుంకించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం సాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రాజమండ్రికి నీటిని తరలించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలు నీటికి గోస పడుతున్నా పట్టించుకోవడంపై లేదని మండిపడ్డారు.