Nandi Medaram | ధర్మారం, జూన్ 19 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో గురువారం రాత్రి గంగాదేవి బోనాల ఉత్సవం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏటా గంగపుత్రులు గంగాదేవి బోనాల ఉత్సవాన్ని మృగశిర కార్తె కి ముందుగా నిర్వహిస్తూ ఉంటారు. 2017 లో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నంది మేడారం గ్రామంలోని పెద్ద చెరువును విస్తరించి రిజర్వాయర్ గా నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా చెరువులో ఇదివరకు ఉన్న గంగపుత్ర గుడి మునిగిపోయింది. ఈ క్రమంలో అప్పటినుంచి సుమారు 9 సంవత్సరాల పాటు గుడి లేని కారణంగా గంగాదేవి బోనాల ఉత్సవాలు నిర్వహించలేకపోయారు.
ఇన్నాళ్ల తర్వాత నంది రిజర్వాయర్ సమీపాన గుట్టపై నూతనంగా గంగాదేవి గుడిని నిర్మించారు. దీంతో గుడిని ఉత్సవాల నిర్వహణ కోసం సుందరీ కరణ చేసి గురువారం గంగాదేవి బోనాల ఉత్సవాన్ని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంటికో బోనంతో మహిళలు బయలుదేరి డప్పు చప్పులతో రాత్రి గుడికి చేరుకున్నారు. అనంతరం గుడిలో గంగాదేవికి నైవేద్యం పెట్టి మొక్కులు సమర్పించారు. ఈ ఉత్సవంలో గంగపుత్ర సంఘం, గంగపుత్ర యువజన సంఘం, కుల పెద్దలు పాల్గొన్నారు.