కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబరు 5 : నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణేశుడికి జిల్లా వాసులు ఘన వీడ్కోలు పలికారు. ఉదయం నుంచే మండపాల వద్ద ఉద్వాసన పూజలు చేయగా.. మధ్యాహ్నం నుంచే విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో విఘ్నేశ్వరులను నిలిపి, కనుల పండువలా శోభాయాత్రలు తీశారు. దారిపొడవునా జనం నీరాజనం పట్టగా, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ సాగనంపారు.
కరీంనగర్లో ఒకటో నంబర్ గణనాథుడికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్లాక్ టవర్వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం తదితరులతో కలిసి ఒకటో నెంబర్ గణనాథుడికి స్వాగతం పలికి పూజలు చేశారు.
లడ్డూ వేలం @2.50 లక్షలు
గణపతి లడ్డూలకు ఈ సారి భారీ ధర పలికింది. జగిత్యాలలో బుగ్గారం మండలం వెల్గొండకు చెందిన కనపర్తి రమణారావు 2.50 లక్షలకు, జగ్యితాలకు చెందిన చిలుకమారి శ్రీనివాస్ 1.71లక్షలకు దకించుకున్నారు. కరీంనగర్లోని సూర్యానగర్ కాలనీకి చెందిన శనిగరం మంజుల, నర్సయ్య దంపతులు 1.82 లక్షలకు, రాంనగర్లో చాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో మంకమ్మతోటకు చెందిన ములుగురి శభరినాథ్- అర్చన దంపతులు 1,72,116 లడ్డూ కైవసం చేసుకున్నారు.